Sakshi: ఏపీ ప్రజలకు శుభవార్త. మీరు పత్రికను ఉచితంగా పొందాలనుకుంటున్నారా? ఇచ్చేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. జగన్ తన మానస పుత్రిక అయిన ‘సాక్షి’ని ఇంటింటికీ పంచేందుకు సరికొత్త పథకం ఒకటి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. వారు ఇంటింటికి వెళ్లి.. ఏ పత్రిక తీసుకొని వారిని ప్రత్యేకంగా గుర్తించి.. వివరాలు అందిస్తే వారు ఉచితంగా సాక్షి పత్రిక పొందగలుగుతారు.
అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు ఉంది. దానిని అధిగమించేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎప్పటికప్పుడు విఫలం అవుతూ వచ్చారు. దీంతో తన వ్యాపార తెలివితేటలకు పదును పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు సాక్షి పత్రికను అంటగట్టారు. దానికి సైతం ప్రభుత్వ సొమ్మునే కేటాయించారు. పత్రిక వాలంటీర్ ఇంటికి చేరకముందే.. కోట్లాది రూపాయల నగదు సాక్షి యాజమాన్యానికి చేరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ధనంతో సొంత పత్రిక సర్కులేషన్ పెంచుకుంటున్న జగన్ దంపతులు ఇప్పటికే కోర్టు సమన్లు అందుకున్నారు. కానీ ఏమాత్రం బెదరని వారు ఇంటింటా ఉచిత పత్రికను పంచిపెట్టే పథకాన్ని వలంటీర్ల ద్వారా అమలు చేయాలని చూస్తున్నారు.
గత నాలుగు నెలలుగా వాలంటీర్ల ద్వారా ఓ సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి ఏయే పత్రికలు వస్తున్నాయో సర్వే చేస్తున్నారు. ఇతర పత్రికలు తీసుకునే వారి వద్దకు వెళ్లి.. జగన్ పత్రిక ఇస్తాం, అదే చదవండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఫ్రీ కదా అని కొందరు తీసుకుంటున్నారు. మరికొందరు ఆ సబ్బు పత్రిక మాకు వద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. మరికొందరైతే ఇలా పత్రిక తీసుకొని చిత్తు పేపర్లుగా విక్రయిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పథకం ప్రారంభం, బటన్ నొక్కడం వంటివి చేపడితే చాలు వందల కోట్ల రూపాయలు సాక్షి పత్రికకు చేరిపోతున్నాయి. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ ప్రకటనల రూపంలో సాక్షి పత్రికకు 400 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఇక పత్రికలో పనిచేసే పెద్ద తలకాయలన్నీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారే. వారికి సైతం సాక్షి జీతాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచే నేరుగా వేతనాలు తీసుకుంటున్నారు. అవన్నీ చాలవు అన్నట్టు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను ప్రజలకు బలవంతంగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.