Rajeev Chandrasekhar: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఈవీఎంలపై చేసిన ట్వీట్ రాజేసిన మంటలు ఇంకా చల్లారడం లేదు. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగంపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ఎలాగైనా హ్యాక్ చేయవచ్చని, హ్యాక్ చేసేందుకు అవేవీ అతీతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మస్క్ కు ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పారు.
“అమెరికాలో ఓటింగ్ మిషన్లు ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి. ఇండియాలో వీటిని బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి మార్గాల ద్వారా అనుసంధానించడం అస్సలు కుదరదు. చివరికి ఈవీఎంలను రిప్రోగ్రామింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. ఈ విషయంలో మీకు ట్రైనింగ్ ఇస్తాం. అవసరమైతే మీరు అమెరికాలో కూడా వీటిని తయారు చేయవచ్చని” రాజీవ్ చంద్రశేఖర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించనున్నారు. అయితే వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మనుషులు హ్యాక్ చేసే అవకాశం ఉందని మస్క్ చెబుతున్నారు. ఈవీఎం విధానాన్ని తొలగించి, పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని మస్క్ అన్నారు. ఇటీవల ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థి కెన్నెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్టుకు ఎలాన్ మస్క్ స్పందించారు. మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలను పక్కన పెట్టేసి.. పేపర్ ఓటింగ్ విధానాన్ని తెరపైకి తేవాలని చర్చ మొదలైంది. దీంతో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
మస్క్ ట్వీట్ చేసిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా అనేక మంది నాయకులు ఈవిఎం హ్యాకింగ్ గురించి స్పందించారు. కొందరైతే కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ప్రస్తావించారు. “ది వైర్” అనే వెబ్ సైట్ రాసిన కథనాలను పోస్ట్ చేశారు. అయితే వీటిపై బిజెపి నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ” కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు గెలిచింది. ఆ స్థానాలలో బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల నిర్వహించాలి. కచ్చితంగా ఆ పార్టీ గనుక అన్ని స్థానాలలో మళ్లీ గెలిస్తే, ఈవీఎంలను పక్కన పెట్టి, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిద్దామని” బిజెపి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కొందరైతే మస్క్.. పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేయకుండా నోరు మూసుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు.
This is a huge sweeping generalization statement that implies no one can build secure digital hardware. Wrong. @elonmusk ‘s view may apply to US n other places – where they use regular compute platforms to build Internet connected Voting machines.
But Indian EVMs are custom… https://t.co/GiaCqU1n7O
— Rajeev Chandrasekhar (@RajeevRC_X) June 16, 2024