Anil Kumar Yadav: వైసిపి ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఆయన జగన్ కు వీరభక్తుడు. అధినేతపై ఈగ వాలనివ్వరు. ప్రత్యర్థులు ఎంతటి వారైనా విరుచుకుపడతారు. ఓ రేంజ్ లో సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ దూకుడే ఆయనకు వైసీపీలో కీలక స్థానాన్ని కట్టబెట్టింది. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తన సొంత సామాజిక వర్గాన్ని కాదని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలక జల వనరుల శాఖను అప్పగించారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసన పలికారు. అయితే ఆయన ఎటువంటి అసంతృప్తి చెందలేదు. కానీ జగన్ అండ చూసుకొని పార్టీలోనే మిగతా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారని ఒక కామెంట్ ఉంది.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవని నివేదికలు వచ్చాయి. బాబాయి రూప్ కుమార్ యాదవ్ తో పాటు వైసిపి కీలక నాయకులు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ తన అత్యంత నమ్మకస్తుడైన అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఖలీల్ నియమితులయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ పట్టు పట్టి ఖలీల్ ను నియమించుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అసంతృప్తితోనే వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరం కానున్నారని కూడా టాక్ నడుస్తోంది.
సీఎం తన సొంత సామాజిక వర్గం నేతలకు కాదని తనకు ప్రాధాన్యమిస్తుండడంతో అనిల్ కుమార్ యాదవ్ మరింత రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అటు తన వ్యతిరేకి అయిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కాదని.. ఆయన ప్రమేయం లేకుండా తాను సిఫారసు చేసిన ఖలీల్ ను నియమించడంతో ఖుషి అవుతున్నారు. మరోవైపు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి వైపు అడుగులు వేస్తుండడం కూడా అనిల్ కుమార్ యాదవ్ కు ఆనందాన్నిస్తోంది. అందులో భాగంగానే ఆయన సీఎం జగన్ పై వీర విధేయత కనబరుస్తున్నారు. నెల్లూరు ను వదిలినప్పుడు బాధ కలిగిందని.. కానీ పల్నాడులో అడుగుపెట్టాక గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొస్తున్నారు. నా తల తెగుతుందన్నా.. జగనన్న కోసం ముందుకే వెళ్తానంటూ స్పష్టం చేశారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్ పంపారని.. పల్నాడు పౌరుషం తగ్గకుండా పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు. జగన్ కు విధేయుడినే కాదని.. వీరభక్తుడునని తేల్చి చెబుతున్నారు.