TDP: 41 ఏళ్లలో తొలిసారి టిడిపికి షాక్.. రాజ్యసభలో నో ఛాన్స్

ఏపీకి చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సీఎం రమేష్, కనకమెడల రవీంద్రల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆ మూడు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది.

Written By: Dharma, Updated On : February 15, 2024 11:13 am
Follow us on

TDP: రాజ్యసభ ఎన్నికల నుంచి టిడిపి తప్పుకుంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా వచ్చిన ఊహాగానాలకు తెరదించినట్టు అయ్యింది. రాజ్యసభ ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వైసీపీ ఖాతాలో మూడు రాజ్యసభ స్థానాలు పడనున్నాయి. రాజ్యసభలో వైసీపీ బలం 11 కు పెరగనుంది. అదే సమయంలో టిడిపికి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

ఏపీకి చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సీఎం రమేష్, కనకమెడల రవీంద్రల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆ మూడు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది. వివిధ సమీకరణల దృష్ట్యా సీఎం జగన్ వై వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు లను రాజ్యసభస్థానాలకు ఎంపిక చేశారు. అటు టిడిపి సైతం పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నుంచి వర్ల రామయ్య, కోనేరు సతీష్ తదితరుల పేర్లు వినిపించాయి. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతుండడంతో.. టికెట్లు దక్కని సిట్టింగులు టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని.. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని విశ్లేషణలు వచ్చాయి. టిడిపి అభ్యర్థి తప్పకుండా బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజ్యసభ ఎన్నికల కోసం టిడిపి పావులు కదిపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టిడిపికి కేవలం 18 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నలుగురు పార్టీ నుంచి ఫిరాయించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నడుమ రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 26 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ వైసీపీ నుంచి ఆ స్థాయిలో సాయం అందుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో అభ్యర్థిని పెట్టడం వృధా ప్రయాస అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే కనకమెడల రవీంద్ర కుమార్ పదవీ కాలం పూర్తి కావడంతో రాజ్యసభలో టిడిపి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. 1983 ఎన్నికల తర్వాత రాజ్యసభలో టిడిపి ప్రాతినిధ్యం ప్రారంభమైంది. మధ్యలో ఎన్నో రకాల ఓటములు ఎదురైనా.. రాజ్యసభలో మాత్రం ప్రాతినిధ్యం ఉండేది. గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా.. రాజ్యసభలో టిడిపికి ఆరుగురు ఎంపీలు ఉండేవారు. అయితే ఎన్నికల అనంతరం నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. చివరికి ఒక్క సభ్యుడిగా ఉన్న కనకమెడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుండడం.. తాజా ఎన్నికల్లో టిడిపి చేతులెత్తేయడంతో.. రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేని దుస్థితి నెలకొంది.