
Former CM Kiran Kumar Reddy joins BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కొద్దిరోజుల్లో ఆయన బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బిజెపి నేతలు ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత ఆయన త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా, చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. రాష్ట్ర యువజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూడడంతో ఆ తరువాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే చేరిపోయారు. అయితే ఆ పార్టీలో చాలా కాలంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ పాల్గొనడం లేదు. ఈ ఈ క్రమంలోనే బిజెపి కన్ను ఆయనపై పడింది. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి పలు పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాలని భావించింది. అందుకు అనుగుణంగానే ముఖ్యమైన నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో భాగంగానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపి ముఖ్య నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన బిజెపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన కొద్దిరోజుల్లోనే బిజెపిలో చేరే అవకాశం కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుల చేరికతో రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని బిజెపి అగ్ర నాయకులు భావిస్తున్నారు.
