Dharani: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా సీఎం కేసీఆర్ ‘ధరణి’ వెబ్ పోర్టల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. తెలంగాణలోని ప్రతీ ఇంచును కంప్యూటీకరణ చేసేలా ప్రణాళికలను రూపొందించి ధరణి పోర్టల్ కు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, నాన్ వ్యవసాయ ల్యాండ్స్ పేరుతో ధరణి పోర్టల్లో భూములను కంప్యూటీకరణ చేసి భూయజమానులకు హక్కులను కల్పిస్తున్నారు.

ఈ ధరణి పోర్టల్ వల్ల భూముల అమ్మకాలు, కొనుగోలు విషయంలో పారదర్శకత పెరుగుతుందని సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ధరణి పోర్టల్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. వారసత్వ భూములు, అసైన్డ్ మెంట్, ఎండోమ్మెంట్, అటవీ భూముల విషయంలో పలు సమస్యలు వచ్చిపడుతోన్నాయి.
వీటిని పరిష్కరించాల్సిన అధికారులు టెక్నికల్ ప్లాబ్లమ్ అంటూ దాటవేసే ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో ధరణి పోర్టల్ వల్ల పాత సమస్యలు తీరడం ఏమోగానీ కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి Dharani పోర్టల్ అమలు చేస్తున్న విధానంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల భూరికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల వివరాలన్నీ విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయంటూ విమర్శలు గుప్పించారు.
రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్నీ సీఎం కేసీఆర్ టెర్రాసిస్ అనే దివాళా బాటపట్టిన సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో పెట్టారన్నారు. గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో టెర్రాసిస్ ఉందని పేర్కొన్నారు. ఇందులోని సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌నకు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసిందన్నారుజ
తద్వారా తెలంగాణ భూముల రికార్డులన్నీ విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయిందని రాములమ్మ తెలిపారు. పకడ్బంధీ నిర్వహించాల్సిన భూరికార్డుల డాటాను ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో పెట్టడంతో వీటి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ధరణి పోర్టల్ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.
మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యలను కూడా ప్రభుత్వం చేయడం లేదంటూ సీఎం కేసీఆర్ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళన పేరిట కేసీఆర్ సర్కారు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందన్నారు. ధరణి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం అందరిపై ఉందని విజయశాంతి గుర్తుచేశారు. విజయశాంతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!