KCR: ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉంది కేసీఆర్ పరిస్థితి. ప్రస్తుతం కేసీఆర్ మాటలు ఎవరు నమ్మడం లేదు. ఫలితంగా ఎన్నికల్లో చేదు అనుభవమే ఎదురవుతోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో పరాభవం చోటుచేసుకోగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అపజయం తప్పదేమో అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ ప్రతినిధులు ఇతర పార్టీలకు ఓటు వేయాలని సంకల్పించినట్లు సందేశాలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖకు తక్షణమే రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా అది ఎన్నికల కోడ్ కావడంతో అమల్లోకి రాదు. దీంతో తరువాత మళ్లీ వాటిని వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటే అని అందరు గుసగుసలాడుతన్నారు. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించి ఇతర పార్టీలకు ఓటు వేసి తమ అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇప్పటికే పలు పనులు చేసి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం వారికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో తమ అప్పులు ఎలా తీరాలనే ఆలోచనతో ఉన్న వారికి ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగా మారాయి. వేరే పార్టీకి ఓటు వేస్తే ఎంతో కొంత డబ్బు అందుతుంది. కానీ సొంత పార్టీ వారికి ఓటేస్తే ఏమొస్తుందో చిప్ప తప్ప అనే వాదన అందరిలో వస్తోంది. అందుకే ఇతర పార్టీలకే మొగ్గు చూపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇతర పార్టీలు టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నాయి. ఇది గమనించిన కేసీఆర్ సొంత పార్టీ నేతలను కూడా శిబిరాలకు తరలిస్తోంది. ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని పాకులాడుతోంది. కేసీఆర్ గురించి తెలియడంతో వారు ఇక ఆయన మాటలు విశ్వసించడం లేదు. ఫలితంగా ఎంతో కొంత లాభం కావాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసమే ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.