Telangana BJP : తెలంగాణలో బిజెపి ఎదిగేందుకు అవకాశాలున్నాయి.. కానీ వాటిని సరైన స్థాయిలో మొన్నటి వరకు ఉపయోగించుకోలేదు. ఇది చదువుతుంటే బిజెపి కార్యకర్తలకు కోపం రావచ్చుగాని.. ఇది ముమ్మాటికీ నిజం. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి జాతీయ నాయకత్వం వేగంగా అడుగులు వేయడంతో.. ఆ ఫలితం కళ్ళముందు కనిపిస్తోంది. ఏకంగా 8 పార్లమెంటు స్థానాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలబడింది బిజెపి. గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న బిజెపి.. ఈసారి వాటిని రెట్టింపు చేసుకుంది. 8 స్థానాలతో పాటు ఓట్ల శాతాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది.. ఈసారి గెలిచిన 8 మంది ఎంపీలలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి సహాయ మంత్రులుగా అవకాశం లభించింది.. దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
గతంలో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన పదవీకాలంలో బిజెపి హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. దీంతో బండి సంజయ్ పనితీరుకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనూహ్యంగా బండి సంజయ్ ని అసెంబ్లీ ఎన్నికల ముందు పక్కన పెట్టడంతో.. ఆ ప్రభావం ఫలితాలపై తీవ్రంగా చూపించింది. అధికారం దక్కించుకుంటుందనే స్థాయి నుంచి.. 8 స్థానాలు మాత్రమే గెలిచే దుస్థితికి బిజెపి పడిపోయింది. దీంతో జాతీయ నాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 8 స్థానాలు గెలిచింది. దీంతో ఒక్కసారిగా బీజేపీలో ఉత్సాహం నెలకొంది. అంతేకాదు ఎంపీగా గెలిచిన బండి సంజయ్, కిషన్ రెడ్డికి మంత్రి పదవులు రావడంతో .. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరితో భర్తీ చేస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది.
బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి వారు మంత్రులుగా వెళ్లిపోయిన నేపథ్యంలో.. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరితో భర్తీ చేస్తారనే ఉత్పనమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ లేదా డీకే అరుణ కు అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే అరుణ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పాలమూరు ఎంపీగా గెలిచారు.. నిన్నటిదాకా ఆమె మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బండి సంజయ్ పేరు తెరపైకి రావడంతో.. డీకే అరుణ ఆగిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి తీసుకొనే క్రమంలో డీకే అరుణ జాతీయ కార్యదర్శిగా ఉండిపోవాల్సి వస్తుంది. వీరిద్దరూ కాకుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతను కాదంటే మాధవనేని రఘునందన్ రావు లేదా కొండా విశ్వేశ్వర్ రెడ్డి లో ఎవరో ఒకరికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని మరింత విస్తరించే క్రమంలో సమర్థవంతమైన నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తారని తెలుస్తోంది..