Forest University : అడవి తల్లి ఒడిలోంచే ఒకప్పుడు మానవుడు ఎదిగాడు. అడవుల్లోనే జీవించాడు. కానీ ఇప్పుడా అడవి చిన్నదైంది. కాంక్రీట్ జంగల్స్ ఎక్కువయ్యాయి.నాగరికత మాటున అడవులను కుచించుకుపోయి పట్టణాలు వెలుస్తున్నాయి. విస్తరిస్తున్నాయి. అందుకే అడవిని మనషులకు దగ్గరకు తేవడానికి.. ఆ అడవిని కాపాడుకోవడానికి తెలంగాణ సర్కార్ నడుం బిగించింది.

ఇప్పటికే హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, నర్సరీలు,హరితనిధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణకు పచ్చలహారం పంచుతున్నాడు కేసీఆర్.ఇప్పుడు ఏకంగా దేశంలోనే తొలి ఫారెస్ట్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతరించిపోతున్న అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని.. దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు.
పారిశ్రామిక , గృహ అవసరాల కోసం వచ్చే డిమాండ్ ను ఎదుర్కొనేందుకు తోట పంటల ద్వారా ఉత్పత్తి చేసే తగిన పద్ధతులు, పరిశోధనను ఈ అటవీ వర్సిటీలో చేయనున్నారు. సంప్రదాయ అటవీ వ్యవసాయంతోపాటు సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా అటవీ వ్యవసాయ నమూనాలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్ర అవసరాలు, జాతీయ విధానాలకు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్రాల్లో నూతన కోర్సులతోపాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు.
ఇక ఈ అటవీ యూనివర్సిటీకి కేసీఆర్ ఛాన్స్ లర్ గా ఉండనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసిని ఛాన్స్ లర్ నియమిస్తారు. ఈ కొత్త వర్సిటీ తెలంగాణను పచ్చలహారంగా మార్చి ప్రజల అవసరాలు తీర్చడంలో గొప్ప ముందడుగుగా మేధావులు అభివర్ణిస్తున్నారు.