అన్ని రంగాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సినీ రంగం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ వలన సినీ పరిశ్రమ కొన్నాళ్ళుగా స్తంభించిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ తో పాటు ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పట్లో కరోనా విముక్తి ఉండదని భావిస్తున్న ప్రభుత్వాలు దాంతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో చాలా సడలింపులు కూడా ఇచ్చాయి.
చిత్ర పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో దాని గురించి చర్చించేందుకు మెగాస్టార్ నేతృత్వంలో కొందరు ప్రముఖులు మీటింగ్ ఏర్పాటు చేయనున్నారట. టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ మోహన్ రావు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. చిరంజీవి నివాసంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తుండగా, ఈ మీటింగ్ లో సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం, థియేటర్స్, సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కరోనా బారిన పడకుండా షూటింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కరోనాతో సినీ పరిశ్రమ కూడా బాగా చితికిపోగా, ఈ మీటింగ్ ద్వారా ఏమేం చెబుతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.