KCR Vs Jagan: కేసీఆర్ తో ఫైట్.. జగన్ అందుకే రాజీపడుతున్నాడా?

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ అందరికీ కావాల్సిన మనిషే. కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటారు. అవసరమైన క్రమంలో పరస్పర సహకారం అందించుకుంటారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి.

Written By: Dharma, Updated On : October 20, 2023 3:55 pm

KCR Vs Jagan

Follow us on

KCR Vs Jagan: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది ఏపీ దుస్థితి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు విభజన హామీలు పరిష్కారం కాలేదు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదు. విభజన చట్టంలో పొందు పరిచిన అంశాలు ఏవీ అమలు కావడం లేదు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు దక్కడం లేదు. ప్రత్యేక హోదాను పక్కన పడేశారు. ప్రత్యేక రైల్వే జోన్ కు అతీగతీ లేదు. ఇలా ఎలా చూసుకున్నా.. ఏపీకి రిక్తహస్తమే.

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ అందరికీ కావాల్సిన మనిషే. కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటారు. అవసరమైన క్రమంలో పరస్పర సహకారం అందించుకుంటారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి తీసుకుంటారు. కానీ విభజన హామీల అమలు విషయంలో మాత్రం ఈ రాజకీయ సాన్నిహిత్యం ఎందుకు అక్కరకు రాకుండా పోతుంది. విభజన హామీలు ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు కావడం లేదు. ఇది ముమ్మాటికీ జగన్ వైఫల్యమే.

ఏపీకి తెలంగాణ నుంచి 6 వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. చెల్లించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ సర్కార్ కోర్టులో సవాల్ చేసింది. దీంతో కేంద్రం ఇచ్చే ఆదేశాలను, ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏపీ సర్కార్ ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీ విద్యుత్ సర్దుబాటు చేసింది. కానీ తెలంగాణ నుంచి మాత్రం చెల్లింపులు లేవు. అందుకే చంద్రబాబు సర్కార్ ఈ విషయంలో గట్టిగానే పోరాడింది. ఒక విధంగా కేసీఆర్ తో వైరం పెట్టుకుంది. అప్పట్లో ఎన్సీఎల్టీలో కేసు వేసింది. అది విచారణలో ఉండగానే జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ కేసును ఉపసంహరించుకున్నారు. కానీ తనకు సన్నిహితుడైన కేసీఆర్ నుంచి విద్యుత్ బిల్లులు, బకాయిలు వసూలు చేయలేకపోయారు.

అయితే తెలంగాణ గవర్నమెంట్ తో పోరాడుతున్నట్లు జగన్ నమ్మబలికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కొట్టివేతకు గురి కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమకు అదే కావాలన్నా రీతిలో వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రజల వద్ద పోరాటం చేస్తున్నానని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తనకు కేసిఆర్ తో ఉన్న బంధాన్ని కేవలం రాజకీయాలకే పరిమితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారన్న విమర్శలను తెచ్చుకుంటున్నారు. దీనిని ప్రజలు గమనిస్తే ఆయనకు రాజకీయ ఇబ్బందులు తప్పవు.