Telangana Assembly Election: తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డబ్బు పంపిణీని ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. అడుగడుగునా తనిఖీలు చేస్తోంది. నగదు, బంగారం, వెండి, చీరలు ఇలా ఏవి దొరికితే అవి పట్టుకుంటున్నది. నగదు దొరికితే సీజ్ చేయడమే తెలుసు అన్నట్టుగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారు. పక్క స్టేషన్ వాళ్లు కోట్లు సీజ్ చేస్తే.. మనం కూడా మన సత్తా చూపిద్దాం అన్నట్టుగా పోలీసులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతిసారి ఎన్నికల సమయంలో సీజ్ అవుతున్న డబ్బుల్లో సింహభాగాన్ని.. ఆ తర్వాత తగిన ఆధారాలను చూపుతున్న వారికి ఇచ్చేస్తున్న విషయం తెలిసినప్పటికీ.. కేవలం తాము పనిచేస్తున్నామని నిరూపించుకునేందుకు పోలీసులు అవసరార్థం డబ్బులు తీసుకెళుతున్న అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు.. ఇక ఎక్కడ డబ్బులు లభిస్తున్నప్పటికీ వాటిల్లో సింహభాగం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసమో.. ఆసుపత్రుల బిల్లుల చెల్లింపులకో.. ఆస్తుల క్రయవిక్రయాలకో.. వ్యవసాయ సంబంధ వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులవే ఉంటున్నాయి.
తెలంగాణ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో నగదు సీజ్ చేస్తున్న నేపథ్యంలో అటు పోలీస్ అధికారులు, ఇటు ఎన్నికల అధికారుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉంటూ 50 వేలకు మించిన నగదును డ్రా చేసే వారిని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు మెదక్ జిల్లా ఏదులాపూర్ ప్రాంతానికి చెందిన నాగయ్య అనే రైతు గేదెను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో 1,40,000 నగదును డ్రా చేసేందుకు విత్ డ్రా ఓచర్ రాసాడు. అక్కడే మఫ్టీలో ఉన్న మహిళా పోలీస్ అతనికి సహకరించారు. నాగయ్య బయటికి రాగానే ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. అయితే నాగయ్య ఆ మహిళ పోలీసును నిలదీస్తే.. ఆ డ్యూటీ నేను చేశాను అని ఆమె సమాధానం ఇచ్చింది. నగదు బ్యాంకు నుంచి డ్రా చేశానని ఓచర్ చూపించినప్పటికీ పోలీసులు తమపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని సమాధానం చెప్పారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కిజ్ గూడ గ్రామానికి చెందిన చెన్నమనేని రమేష్ బాబు అనే పత్తి, ఎరువులు వ్యాపారి.. పత్తి కొనుగోలుకు సంబంధించిన 4.10 లక్షలు రైతులకు అందజేసేందుకు వెళుతుండగా పోలీసులు సీజ్ చేశారు.
ఇక పొరపాటున తమ చెక్ పోస్టును దాటి వేరే చెక్ పోస్ట్ వద్ద నగదు పట్టుబడితే తమపై చర్యలు తప్పక హెచ్చరికలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తీరుపట్ల విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్న నేపథ్యంలో 50 వేలకు పైగా నగదు, అది గ్రాములకు పైగా బంగారం కనిపిస్తే పోలీసులు స్వాధీనం చేసుకోవడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్పందించింది. సరైన ఆధారాలు చూపిస్తే 48 గంటల్లో తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. అయితే నగదు లేదా బంగారం విలువ 10 లక్షల లోపు మాత్రమే ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరోవైపు పోలీసులు, ఎన్నికల అధికారుల తీరు పట్ల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. మరో వైపు గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా ₹78 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను పోలీసులు సీజ్ చేయడం విశేషం.