BRS Dissident Leaders
BRS: ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. వారికే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మిగతా పార్టీల అభ్యర్థులయితే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. కార్యకర్తలను కలుపుకొని పోయి తాము ఏం చేస్తామో చెబుతారు. కానీ భారత రాష్ట్ర సమితిలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి స్వయానా పేర్లు ప్రకటించినప్పటికీ.. ప్రత్యర్థి పార్టీల కంటే నాలుగు అడుగులు ముందుగానే ఉన్నప్పటికీ.. కారు పార్టీకి చెందిన అభ్యర్థుల్లో భయం ఇంకా అలానే ఉంది. అసలు తనకు బీ ఫామ్ దక్కుతుందో లేదో అనే టెన్షన్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
వాస్తవానికి కెసిఆర్ ఎన్నికల సన్నాహాలు చాలా భారీగా ఉంటాయి. 2018లో అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు హైదరాబాదులో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్. తర్వాత అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థులను ప్రకటించారు. పరసటి రోజు నుంచే కేసీఆర్ రంగంలోకి దిగిపోయారు. ఆయన ప్రకటించిన అభ్యర్థుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించి నెల దాటిపోయింది. అభ్యర్థులు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడంతోనే ఆగిపోతున్నారు. అంతే తప్ప జనాల్లోకి ఇంకా పోవడం లేదు. కెసిఆర్ కూడా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవ మినహా జనంలోకి వెళ్లడం లేదు. కేటీఆర్ కూడా మొన్నటి వరకు అమెరికాలో ఉండి వచ్చారు. పైగా ఎన్నికలు ఆలస్యం కావచ్చు అంటూ ఆయన కామెంట్లు కూడా చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నేతలు కూడా ఎన్నికలను సులభంగా తీసుకునేలా చేశారు. కెసిఆర్ ప్రకటించిన కొంతమంది అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
అభ్యర్థులను ప్రకటించేటప్పుడే కేసీఆర్ కూడా ఇదే అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. కొన్నిచోట్ల మార్పులు ఉంటాయని సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యల ప్రభావమో, ఇంకోటో తెలియదు గాని గులాబీ పార్టీలో ఎన్నికల జోష్ కనిపించడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తారని, తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తారని అందరూ అనుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి 1 లేదా రెండు జిల్లాలకు మించి వెళ్లిన సందర్భాలు లేవు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఆసరా పింఛన్ల పంపిణీ వరకే పరిమితం అవుతున్నారు. అధికారిక వేదికల నుంచే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అంత తప్ప సొంతంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనడం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టికెట్ దక్కిందని మురిసిపోతున్న వారు ఎవరికీ కూడా బి ఫాం వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే బి ఫామ్ చేతికి అందిన తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని అభ్యర్థులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.