Goddess Lakshmi: లక్ష్మి.. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటారు. ప్రతీ ఇల్లు లక్ష్మీ నిలయం కావాలని ఆకాంక్షిస్తారు. అష్టలక్ష్మిలు కొలువై ఉన్న ఇట్లో ప్రతీరోజూ పండుగే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం హిందువులు పూజలు, పునస్కారాలతోపాటు వాస్తు, చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటారు. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగుతాయి. ఆర్థిక, ఆరోగ్య సంపన్నులుగా మారతారు. అయితే లక్ష్మీదేవి ఎలా వస్తుంది.. అమ్మవారి రాకకు సంకేతాలు ఏమిటి.. అనే అంశాలను జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని సంకేతాలు ఉన్నాయట. ఆ సంకేతాలు ఎవరికి కనిపించినా.. అనిపించినా.. వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయనేందుకు అర్థం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి లక్ష్మీదేవి రాక ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
కొన్ని కలలు సంకేతమే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు మనకు కొన్ని కలలు వస్తాయి. కలలో దేవుడిని చూడటం, కలలో నిధి కనిపించడం, చెట్లు, మొక్కలు, పచ్చదనం కనిపించడం జరుగుతుంది. కలలో ఇవి కనిపిస్తే.. త్వరలోనే మీ జీవితంలో మంచి రోజుల ప్రారంభానికి సంకేతంగా భావించాలంటున్నారు. జ్యోతిష్య పండితులు.
ప్రకృతి పచ్చగా..
మంచి రోజులు రావడానికి ముందు ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా, అందంగా కనిపిస్తుంటుంది. అదే విధంగా ఇంట్లోని అరటి చెట్లు, మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి. ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
అన్నీ మంచి శకునాలే..
మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు.. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు.. వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. అన్నీ మంచి శకునాలే కనిపిస్తాయి.
ఇంట్లో ఇవి కనిపిస్తాయి..
ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీటమ గుంపును చూసినప్పుడు, ఉదయం శంఖం ధ్వనిని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీపై దయ చూపిందని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.