Jagan London Tour: ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై దుష్ప్రచారం పెరుగుతోంది. ఎదుటి వ్యక్తి మనోభావాలను కించపరిచేలా ఈ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం జగన్ సైతం ఇటువంటి చర్యలకు బాధితునిగా మిగలడం విచారకరం. పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈనెల 2న సతీమణి భారతి తో కలిసి లండన్ బయలుదేరి వెళ్లిన జగన్.. ఈనెల 12న తిరిగి రానున్నారు.
సాధారణంగా సీఎం విదేశీ పర్యటన అంటేనే.. ప్రవాసాంధ్రులు చుట్టుముడుతారు. అందుకే జగన్ తన వ్యక్తిగత పర్యటనను గోప్యంగా ఉంచారు. కనీసం వైసిపి నాయకులకు కూడా తెలియనివ్వలేదు. కానీ ఇటువంటి నేపథ్యంలోనే జగన్ పై ఓ ట్రోలింగ్ జరిగింది. దీంతో వైసీపీ నేతలు ఆందోళన చెందారు. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏపీ సీఎం జగన్ అందరికీ అందుబాటులో ఉంటారని.. ఆయనను నేరుగా వచ్చి కలవచ్చని సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరల్ గా మారింది. ఈ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేదికను లండన్ లోని మెంటల్ ఆసుపత్రిగా చూపడం విశేషం. లండన్ ఎంహెచ్సీ సెంటర్లో జగన్ కలవచ్చని .. లంచ్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పై రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఒక ఆరోపణలు చేస్తుంటారు.. ఆయన మానసిక స్థితి బాగా లేదని వ్యాఖ్యానిస్తుంటారు. దానికి అర్థం వచ్చేలా.. లండన్ లో జగన్ మానసిక రుగ్మతకు సంబంధించిన ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పెను దుమారానికి దారితీస్తోంది. ఇది ఫేక్ ప్రకటనని వైసిపి యూకే కన్వీనర్ ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. జగన్ వ్యక్తిగత పర్యటన కోసమే లండన్ వచ్చారని.. పూర్తిస్థాయి సమయాన్ని ఫ్యామిలీతోనే గడుపుతారని.. ఇటువంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ యూకే కన్వీనర్ ప్రదీప్ చింతా సూచించారు.