https://oktelugu.com/

Telangana Job Calendar : జాబ్ క్యాలెండర్ లేకుండా పరీక్షలా? ఇదేనా తెలంగాణ మోడల్

జాబ్ క్యాలెండర్ లేకుండా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి చెల్లిందని.. దీనిని రోల్ మోడల్ అని ప్రచారం చేసుకోవడం ఎబ్బెట్టుగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

Written By: , Updated On : August 13, 2023 / 05:43 PM IST
Follow us on

Telangana Job Calendar : ఈ నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నాయి. గురుకుల బోర్డు పరీక్షలు రాసే అభ్యర్థులు గ్రూప్_2 కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా ఉంటున్నది. ఇలాంటప్పుడు అభ్యర్థులు తీవ్రంగా సాధన చేస్తేనే ఉద్యోగాన్ని సాధించగలరు. అలాంటప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలు, గురుకుల బోర్డు నిర్వహించే పరీక్షలకు కొంత వ్యవధి ఉండాలి. ఈ మాత్రం సోయి లేదు కాబట్టే హైకోర్టు చేతిలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చివాట్లు తిన్నది. అఫ్కోర్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి.. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పేపర్ లీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్వని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరం.

పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతోనే చివరి నిమిషంలో వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురుకుల బోర్డు మధ్య సమన్వయ లోపం ఈ పరీక్షల వాయిదాకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా గురుకుల నియామక బోర్డు తన నియామకాలను వేసవి సెలవుల్లో చేపడుతుంది. ఆఖరిలో నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. మే, జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి నియామకాల ప్రక్రియను పూర్తిచేస్తుంది. అయితే, ఈసారి గురుకుల బోర్డు నోటిఫికేషన్ ను నాలుగైదు నెలల ఆలస్యంగా ఏప్రిల్ లో విడుదల చేసింది. వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవి మరో 15 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 25 రోజులపాటు జరిగే ఈ పరీక్షలను నిర్వహించే ముందు కనీసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కీలకమైన గ్రూప్ _2 పరీక్షల తేదీలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యంగా, గ్రూప్_2 పరీక్ష ఆగస్టు నెలాఖరులో ఉందని తెలిసీ ఇదే నెలలో పరీక్షలు నిర్వహిస్తోంది.

ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తే ఒకే అభ్యర్థి అనేక పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటాడు.. పరీక్షల మధ్య విరామం లేకుంటే ప్రిపరేషన్ కు సమయం ఉండదు. దీంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశాలుంటాయి. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం విచారణ సందర్భంగా ప్రస్తావించింది. ఎన్నికలకు ముందు సాధ్యమైనాన్ని నోటిఫికేషన్ ఇచ్చి లబ్ధి పొందాలని ఆలోచనతోనే ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, అభ్యర్థుల సమస్యలను గుర్తించడం లేదని నిపుణులు అంటున్నారు. కొద్దిరోజుల వరకు జోనల్ వ్యవస్థ పేరుతో సమయాన్ని వృధా చేసిన ప్రభుత్వం.. తర్వాత ఉద్యోగుల ఖాళీలను గుర్తించడంలో జాప్యం ప్రదర్శించింది. ఫలితంగా ఉద్యోగాల నియామకాలలో ప్రభుత్వం విఫలమైందని అభ్యర్థులు అంటున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు అంటే తెలంగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వారు గుర్తు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లేకుండా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి చెల్లిందని.. దీనిని రోల్ మోడల్ అని ప్రచారం చేసుకోవడం ఎబ్బెట్టుగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.