Telangana Economy : రాజకీయాలు వేరు, నిజాలు వేరు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది అన్నది నిజం. కేంద్రం తాజాగా బయటపెట్టిన డేటా.. తెలంగాణ ఏ రేంజ్‌లో దూసుకుపోతోందో తెలియజేస్తుంది. కేంద్రం గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పుడు అత్యధికంగా సంపాదిస్తున్నది తెలంగాణ ప్రజలే. ఒక్కమాటలో చెప్పాలంటే… దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాల్లో టాప్‌లో ఉన్నది తెలంగాణే. ఇప్పుడు తెలంగాణ సాదాసీదా రాష్ట్రం కాదు. ఇదో ఎకనామిక్ పవర్ హౌస్. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పాలసీలు.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయి. అందుకే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉంది. అంతేకాదు.. నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో కూడా మిగతా అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణ ప్రజలు టాప్‌లో ఉన్నారు.
తలసరి ఆదాయం 72 శాతం వృద్ధి..
కేంద్ర ఆర్థిక శాఖ, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ.. తాజాగా పార్లమెంట్‌లో వెల్లడించిన డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,08,732 ఉండగా.. కర్ణాటకలో అది రూ.3,01,673, హర్యానాలో రూ.2,96,685 ఉంది. గడిచిన ఆరేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం… 72 శాతం పెరిగింది. 2017-18లో రూ.1,79,358 ఉంది. 2014-15తో పోల్చితే.. తలసరి ఆదాయం 151 శాతం పెరిగింది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 2014-15లో రూ.1.72 లక్షలు ఉండగా.. 2022-23లో అది రూ.3.12 లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదల 81 శాతం ఉంది. దీన్ని బట్టీ.. తెలంగాణ ప్రజలు.. దేశంలోనే అత్యధికంగా ఆదాయం పొందడమే కాదు.. దేశానికి కూడా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు.
కష్టానికి తగిన ప్రతిఫలం..
నిజానికి తెలంగాణ మొన్ననే పుట్టిన రాష్ట్రం. కానీ తెలంగాణ ప్రజలు బాగా కష్టపడుతూ.. రాష్ట్రాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో కాళేశ్వరంతో సాగునీటి లభ్యత పెరిగింది. రైతు బంధు, పథకాలు సహకరించాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక పురోగతి కూడా ఆదాయం పెరగడానికి కారణమైంది. హైదరాబాద్ ఆదాయానికి ప్రధాన వనరుగా మారింది. ఫలితంగా గుజరాత్, కేరళ , కర్ణాటక , మహారాష్ట్ర , తమిళనాడు లాంటి రాష్ట్రాలు వెనక్కి వెళ్లిపోయాయి.
కేంద్రానికి భారీగా పన్నులు.
తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లే.. టాక్సుల రూపంలో తెలంగాణ రాష్ట్రం భారీగా కేంద్రానికి మనీ ఇస్తుంటే.. కేంద్రం మాత్రం నిధులు సరిగా ఇవ్వట్లేదు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధులు 6 శాతమే పెరిగాయి. అదే సమయంలో కేంద్రానికి దేశవ్యాప్తంగా పన్నుల నుంచి ఆదాయం 24.5 శాతం పెరిగింది. ఆ విధంగా కేంద్రం.. తెలంగాణకు సరైన న్యాయం చెయ్యట్లేదని ఈ డేటా నిరూపిస్తోంది.