Bangkok Trip: ఆయనో మాజీ మంత్రి కుమారుడు. అతడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఉన్నట్లుండి ఓ అపరిచితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. అతడి తండ్రి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి కిడ్నాప్ చేసి నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలివచ్చింది. దీంతో చిన్న బాబు సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది.
వివరాల్లోకి వెళితే.. శివసేన(షిండే వర్గం) నేత.. మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారంటూ సోమవారం రాత్రి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఈ వ్యవహారం మహారాష్ట్ర మొత్తం కలకలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న మాజీ మంత్రి తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నట్లు సమాచారం గ్రహించారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కుమారుడిని ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు.
ఆ వెంటనే డీజీసీఏ(DGCA)కు ఈ కేసు గురించి సమాచారం అందజేశారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తిరిగి తీసుకుని రావాలంటూ పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకుని లైట్ తీసుకున్నారు. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే విమానాలను అలా వెనక్కి తిప్పుకుని రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినా ఎందుకైనా మంచిదని ఎయిర్ పోర్టు అధికారులు నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.
పుణె ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండా అవ్వగానే విమానంలో ఉన్న ముగ్గురు కంగుతిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్‌ఎఫ్(CISF) సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడని తర్వాత తెలిసింది. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి మండిపడ్డారు. మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావుడి జరిగిందో… అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. ఈ హైడ్రామాపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.