Viral Video : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. హైదరాబాద్ నగరంలో అక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించారు. చెరువుల పరిరక్షణకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించారు.. వ్యక్తిగతంగా రంగనాథ్ సౌమ్యుడు. ఏపీలోని గుంటూరు ప్రాంతానికి చెందినప్పటికీ.. తెలంగాణలోనే ఆయన ఎక్కువ కాలం పని చేశారు. గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసినప్పుడు అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు.
రంగనాథ్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆయనను హైడ్రా కమిషనర్ గా నియమించారు.. రంగనాథ్ ఆధ్వర్యంలోనే ఆమీన్ పూర్ చెరువులో ఆక్రమణల నుంచి మొదలుపెడితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ వరకు రంగనాథ్ తన మార్క్ చూపించారు. ఈ వ్యవహారాలలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రంగనాథ్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలు చేసినా ఆయన ఏమాత్రం చలించలేదు. పైగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఇప్పటికీ చేసుకుంటూనే వెళ్తున్నారు. హైదరాబాదులో చెరువుల పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తున్నారు. వాగులపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ రోడ్లను, నాలా లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను పడగొడుతున్నారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి హైడ్రా లక్ష్యాలను నెరవేర్చడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాదికి చుక్కలు చూపించారు
ఇటీవల హైదరాబాద్ నగరంలో కొన్ని నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రంగనాథ్ అక్కడికి వెళ్లారు. ఆ ప్లాట్ లకు సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. అందులో సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాది కూడా ఒకరున్నారు. ప్లాట్లను పడగొట్టిన విషయంలో ఆయన రంగనాథ్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎంతో సౌమ్యంగా ఉండే రంగనాథ్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పని చేసే న్యాయవాదికి చుక్కలు చూపించారు. రంగనాథ్ ఒక్కో విషయాన్ని విడమరిచి చెబుతుంటే సుప్రీంకోర్టు లాయర్ నీళ్లు నమిలారు. అయితే కొంతమంది రంగనాథ్ పై చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తుంటే పోలీసులు కల్పించుకున్నారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని.. ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు.. ఇదే సమయంలో సుప్రీంకోర్టు లాయర్ కు రంగనాథ్ గట్టిగా చురకలు అంటించారు.. లా గురించి నాకు తెలుసు అని..
లా చదువుకుని ఇక్కడి దాకా వచ్చానని.. ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించొద్దని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చివరికి తమ ఒక పద్ధతి ప్రకారమే పనిచేసుకుంటూ వెళ్తున్నామని.. అడ్డగోలుగా ఎక్కడా వ్యవహరించడం లేదని రంగనాథ్ ఆ సుప్రీంకోర్టు లాయర్ కు సూచించారు. రంగనాథ్ లా తో కొట్టడంతో సుప్రీంకోర్టు లాయర్ కు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.