Uttar Pradesh: ఆమధ్య ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును విచారిస్తున్నప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు నెయ్యి డబ్బాలు అనే పదం పదేపదే ఎదురయింది. దీంతో దానికి అర్థం ఏమిటో వారికి అవగతం కాలేదు. ఈ క్రమంలో ఆర్థిక నేరాల కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత.. అతడి కేసును కూడా విచారిస్తున్న క్రమంలో నెయ్యి డబ్బాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అధికారులకు షాక్ తగిలినంత పనైంది. ఆ తర్వాత అతడిని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కాం లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తమ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నెయ్యి డబ్బాలు అనే పదాన్ని వాడారు. ఇందులో నెయ్యి డబ్బా అంటే కోట్లు అని అర్థమట.
సరిగ్గా లిక్కర్ స్కాంలో మాదిరి.. ఉత్తర ప్రదేశ్ లో ఉదంతం జరిగింది. కాకపోతే ఇది లిక్కర్ స్కాం స్థాయి కుంభకోణం కాదు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయం సర్కులేట్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బావల్ పూర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రామ్ కృపాల్ సింగ్ పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేరం జరిగింది. ఆ నేరానికి సంబంధించి ఓ వ్యక్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తమకు అందిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి శైలిలో విచారించారు. ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి తనను తప్పిస్తే భారీగా డబ్బులు ఇస్తానని ఎస్ఐకి ఆ నిందితుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టెంప్ట్ అయిన ఎస్ఐ ఒక్కసారిగా తన రూట్ మార్చుకున్నాడు. ఇదే క్రమంలో పై అధికారులకు తెలియకుండా ఆ నిందితుడిని విడుదల చేశాడు.
అయితే తనకు రావాల్సిన డబ్బులకు సంబంధించి ఆ నిందితుడికి ఎస్ఐ ఫోన్ చేశాడు. వాట్సప్ కాల్ లో మాట్లాడినప్పటికీ పదేపదే ఆలుగడ్డలు అని సంబోధించాడు. ఈ కేసు నుంచి బయట పడేసాను కాబట్టి తనకు ఐదు కిలోల ఆలుగడ్డలు ఇవ్వాలని ఆ ఎస్ఐ డిమాండ్ చేశాడు. దానికి ఆ నిందితుడు 2 కిలోల ఆలుగడ్డలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఫైనల్ గా మూడు కిలోల ఆలుగడ్డలు ఇచ్చేందుకు సెటిల్మెంట్ పూర్తయింది. అయితే ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. లక్ష రూపాయలను కిలో ఆలుగడ్డలుగా ఆ ఎస్సై సంబోధించాడు. ప్రస్తుతం సై ఆడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఎస్ ఐ ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. అయితే ఆ ఎస్ఐ వ్యవహారం ఉత్తరప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.