Ethanol Petrol In India: గ్లోబల్ మార్కెట్ పరంగా.. వినియోగదారుల పరంగా భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది.. జనాభాపరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది కాబట్టి మనదేశంలో ప్రతి వస్తువు వినియోగం కూడా అధికంగా ఉంటుంది. ఇందులో చమురు ముందు వరుసలో ఉంటుంది. మనకు దేశీయంగా అవసరాలకు అనుగుణంగా చమురు లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్లే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు మనం ఎక్కువగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. ప్రపంచ దేశాలలో ఏవైనా సున్నితమైన పరిస్థితి ఏర్పడితే ఆ ప్రభావం చమురు ధరల మీద పడుతుంది. చమురు ధర పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది.
చమురు మన దేశ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి కొంతకాలంగా.. ఇంధనం వాడకంలో మార్పులు రావాలని.. సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే పెట్రోల్ లో 20% ఇథనాల్(ఈ 20) వాడకం.. ఇందులో భారత విజయవంతమైనది. అంతేకాదు తదుపరి లక్ష్యంగా పెట్రోల్ లో 25 శాతం ఇథనాల్ కలపడాన్ని పెట్టుకుంది. మనదేశంలో పెట్రోల్ లో 19.97 శాతం ఇథనాల్ కలిపే విధానం అక్టోబర్ నాటికి పూర్తయింది. ఇథనాల్ బ్లండెడ్ పెట్రోల్ కలిపే విధానం గడువు కంటే ముందుగానే పూర్తయింది. ఈ విధానంలో మన దేశం మిగతా వాటి కంటే ముందుగానే పూర్తిచేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ25 లక్ష్యానికి త్వరలోనే చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశలవారీగా ఈ27, 30 శాతాలు కూడా పూర్తవుతాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇంధన రంగ నిపుణుల అంచనా ప్రకారం 2025, 26 సంవత్సరానికి గాను మనదేశంలో ఇథనాల్ సరఫరా డిమాండ్ కు మించి ఉన్నది. 1,350 కోట్ల లీటర్ల అవసరం ఉండగా.. సప్లై మాత్రం 1,775 కోట్ల లీటర్ల ఉంది. మనదేశంలో ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 1,900 కోట్ల లీటర్లుగా ఉంది. 2020,21 సంవత్సరాలలో మనదేశంలో 302.3 కోట్ల లీటర్ల ఇథనాల్ కల్పిన పెట్రోల్ విక్రయించారు. అప్పట్లో పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎనిమిది నుంచి పది మధ్య ఉండేది. 2024, 25 సంవత్సరాల కాలంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ 1022.4 కోట్ల లీటర్లను విక్రయించారు..
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 2024లో ఇథనాల్ ఉత్పత్తిలో అమెరికా ముందు వరసలో ఉంది. 61.4% ఇథనాల్ ను అమెరికా ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 33.2%తో బ్రెజిల్, 6.2%తో ఇండియా, 5.5%తో యూరోపియన్ యూనియన్, 4.5% తో చైనా, 1.8%తో కెనడా, 1.4% థాయిలాండ్, అర్జెంటీనా 1.2 శాతం, ఇతర దేశాలు 3.1 శాతం ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ వినియోగం పై కాస్త ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా విదేశీ మారకద్రవ్యం అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని కేంద్రం చెబుతోంది.