
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు అందరూ తమ ప్రచారానికి పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా.. యువ నాయకుడిని బరిలో నిలిపిన కాంగ్రెస్ కూడా గట్టిపోటీ ఇస్తామని చెబుతోంది. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ మంత్రులతో పాటు ముఖ్య నాయకులు కొన్నాళ్లుగా హుజూరాబాద్ లోనే మకాంవేశారు. కొందరు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండగా.. మరికొందరు అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇంకొందరైతే.. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ.. బీజేపీ పార్టీకి ఓటు వేయొద్దని చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తమ జోరును మరింత పెంచారు. ముఖ్యనాయకుల షెడ్యూల్ ను కూడా సిద్ధం చేసుకున్న టీఆర్ఎస్ నాయకులు.. ప్రధాన ప్రచారాన్ని ఇప్పటికే ముగించేసుకున్నారు. మరోసారి ఓటర్ల వద్దకు వెళ్లి తమ అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
అయితే బీజేపీలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తోంది. భూ కబ్జాల ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీని వీడిన రాజేందర్ వెంటనే హుజూరాబాద్(Huzurabad) కు వచ్చారు. ఇక్కడి ప్రజలతో తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించారు. కొత్త పార్టీ పెట్టాలా.. ప్రధాన పార్టీలో చేరాలా అన్న సలహాలను తీసుకున్నారు. సుదీర్ఘంగా ఆలోచన చేసి… ఈటల బీజేపీలో చేరారు. అయితే అప్పటికే బీజేపీకి రాజేందర్ అనుచరుల మధ్య పోరు తీవ్రంగానే ఉంది. రాజేందర్ టీఆర్ఎస్ లో చేరిన తరువాత చాలా మంది బీజేపీ నాయకులు పార్టీ మారుతున్నారు. నోటిఫికేషన్ కు ఐదు నెలల ముందునుంచే ప్రచారం నిర్వహిస్తున్న రాజేందర్ ఒంటరిగానే ముందుకు సాగుతున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. పార్టీ నేతలు ఎవరూ తనతో కలిసిరావడం లేదనేది ప్రధాన ఆరోపణ.
ఇప్పటి వరకు జరిగిన ప్రచార కార్యక్రమాల్లో తన అనుచరులైన తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు బొడిగె శోభ ఇంకొందరు నాయకులు తప్పా.. బీజేపీకి చెందిన ప్రధాన నాయకులు ప్రచారంలో సహకరించడం లేదనేది ఆరోపణ. ఈటల బీజేపీలో చేరిన కొత్తలో అతడిపై అమిత ప్రేమ చూపిన కమలం ప్రధాన నాయకులు మండలాల వారీగా ఎన్నికల కమిటీని కూడా నియమించారు. అయితే సదరు కమిటీ సభ్యులు చుట్టంలా వచ్చి వెళ్లడం తప్పా.. బాధ్యతను బుజాలపై వేసుకున్న రోజు లేదని ఈటల వర్గీయులు కొందరు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కసారి వచ్చి ప్రచారంలో పాల్గొని వెళ్లాడని.. జిల్లా ప్రధాన నాయకులది అదే నియోజకవర్గం అయినప్పటికీ.. రాజేందర్ కు అనుకూలంగా ప్రచారం చేయడంలో కొంచెం ఖేదం.. కొంచెం మోదం చూపుతున్నారని చెబుతున్నారు.
టీఆర్ఎస్ గెలుపుకోసం మంత్రి హరీశ్ రావుతో పాటు.. గంగుల కమలాకర్.. కొప్పుల ఈశ్వర్.. ఇతర మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేలు చోటామోటా లీడర్లు అందరూ హుజూరాబాద్ లో మకాం వేశారు. బీజేపీలో మాత్రం రాజేందర్ ఒంటరిగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ధర్మం.. న్యాయమే తన ఆయుధమని చెప్పకుంటూ.. ప్రజలను కలుపుకునే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే హుజారాబాద్ లో తమకన్నా ఎక్కువ పట్టున్న వ్యక్తి రాజేందర్ అని.. ప్రతీ గ్రామంలో పరిచయం ఉన్న రాజేందర్ కే హుజూరాబాద్ ఓటర్లు పట్టం కడతారని బీజేపీ ప్రధాన నాయకులు చెబుతున్నారు. ఈక్రమంలో తాము పెద్దగా కష్టపడకపోయానా.. ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.