Etela Rajender: భారతీయ జనతా పార్టీ తెలుగు వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఇన్నాళ్లు పార్టీలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పార్టీ ఇక్కడ తన ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో దక్షిణాది స్టేట్లపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో బీజేపీ ఎప్పుడు కూడా మన ప్రాంతాలపై పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. ఎప్పుడు ఉత్తరాది ప్రాంతాలకే పెద్ద పీట వేసేవారు. కానీ గత కొద్ది కాలంగా మన దక్షిణాదికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలో కూర్చేబెట్టాలనే ఉధ్దేశంతోనే నేతలు మనకు తగిన గుర్తింపు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఎప్పుడు కూడా తెలుగు వారికి అందలాలు ఎక్కించిన దాఖలాలు కనిపించవు. ఈ సారి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. కమిటీ కూర్పులో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు ప్రాంతాలకు కూడా సముచిత స్థానం దక్కినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు కేంద్ర నాయకత్వం అంటే ఏ కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు లాంటి వారికే పదవులు కట్టబెట్టేవారు. కానీ ఈసారి తెలుగు ప్రాంతాల్లో ఏరికోరి సమర్థులైన వారికి స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉంటారు. ఇందులో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా అధ్యక్షులు, స్టేట్ ప్రభారిస్, సాహ్ ప్రభారిస్, రాష్ర్ట అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఉంటారు.
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్నుంచి కన్నా లక్షినారాయణ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు స్థానం కల్పించారు. జాతీయ ఆఫీసు బేరర్లలో తెంలగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి పురందేశ్వరికి చోటు కల్పించారు. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యకుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించి తెలుగువారికి ప్రాధాన్యం కల్పించినట్టు తెలుస్తోంది.