18 ఏళ్ల అనుబంధం మనది హరీశ్.. అన్ని మరిచిపోయి సీఎం దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆరోపణలకు పాల్పడడం మానుకోవాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హితవు పలికారు. గురువారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీశ్ రావుకు తనకు ఉన్న స్నేహం ఈనాటిది కాదని చెప్పారు. ధర్మం, న్యాయానికి విరుద్దంగా పని చేస్తే ప్రజల్లో చులకన అవుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు పని చేస్తున్న హరీశ్ రావు బాధ్యతలు మరిచిపోతున్నారని గుర్తు చేశారు. దుబ్బాకలో ఎంత ప్రచారం చేసినా జరిగిందేమిటో ప్రజలకు తెలుసని తెలిపారు. హుజురాబాద్ లోనూ అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
రాష్ర్ట ప్రభుత్వంలో నిండుగా డబ్బులున్నా మధ్యాహ్న భోజన కార్మికులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు రాష్ర్టం మొత్తం అమలు చేసి దళితబంధు మాత్రం హుజురాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఓట్లేస్తే పథకాల నుంచి పేర్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో డబ్బులు పంచడానికి హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు అమ్మేశారని ఆరోపించారు. ఎన్ని చేసినా ఎన్నికల్లో గెలిచేది నేనేనని తెలిపారు.
ప్రభుత్వం చెబుతున్న మోసపూరిత మాటలను ఎవరు నమ్మరని అన్నారు. హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుందని చెప్పారు. హుజురాబాద్ లో అభివృద్ధి జరగలేదని అంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజురాబాద్ రూపురేఖలు మార్చానని అన్నారు. అప్పుడు కూడా నా ఓటమికే కేసీఆర్ ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు నన్ను ఓడించడానికి దళితబంధు పేరుతో పథకాలు తెస్తున్నారని మండిపడ్డారు.
ఎన్ని పథకాలు చేపట్టినా హుజురాబాద్ గెలుపు బీజేపీదే అని స్పష్టం చేశారు. అనవసర ప్రతిష్టలకు పోయి పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్ని దారులు వెతుకుతున్నా గెలుపు దారి తమదే అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోరు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హుజురాబాద్ పోరుపై రాష్ర్టమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుందన్నారు.