హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచారం జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాలుగా విమర్శలు చేసుకుంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ కు ప్రజల కంటే ఓట్ల మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో దేశద్రోహులంతా తెరపైకి వస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్ లో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లు రువ్విన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు సీఎం ప్రయత్నించారని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.150 కోట్లు నగదు రూపంలో ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పించాలని కోరారు.
దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడానికి కేసీఆర్ నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం రాష్ర్టంలోని అన్ని కుటుంబాలకు అందజేయాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హామీల అమలుకు కచ్చితంగా పాటుపడాలని తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావు డ్రామాలు ఆడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయనకే వదిలేస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల విశ్రాంతి తరువాత పాదయాత్ర ప్రారంభిస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పారు.