Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నానిది విచిత్ర వైఖరి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి అర్థం కాదు. కొంతకాలం సైలెంట్ గా ఉంటారు. ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి బాంబు పేల్చుతారు. సొంత పార్టీని కలవరపరుస్తారు. మరోసారి రాజకీయ ప్రత్యర్థులపై మాటలతో మంట పుట్టిస్తారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. బెజవాడ తనదేనంటూ ఆయన చేసిన కామెంట్స్ హీటెక్కిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేశినేని నాని గెలుపొందారు. ఎన్నికల అనంతరం ఆయన స్వరం, ఆహార్యం మారింది. ఆయన వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంత చిక్కడం లేదు. సాక్షాత్ నారా లోకేష్ జిల్లాలో చేపడుతున్న పాదయాత్రకు గైర్హాజరైన నాని ఇక పార్టీకి దూరమవుతారని ప్రచారం జరిగింది. కానీ అదే సమయంలో ఢిల్లీలో చంద్రబాబు పర్యటిస్తున్నప్పుడు ఆయన వెంట మెరిశారు. అన్నీ తానై వ్యవహరించారు. పెద్దాయనతో సఖ్యతగా మెలిగి.. చిన్న బాబుకు దూరంగా మెలగడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు అయోమయానికి గురయ్యారు. కానీ ఇటీవల ఆయన ఓ ప్రకటన చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్సభలో అడుగు పెడతానని ప్రతిన బూనారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగానే నాని బరిలో దిగుతారని కన్ఫర్మ్ అయ్యింది. చంద్రబాబు సైతం భరోసా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోంది. అనూహ్యంగా విజయవాడ తెరపైకి కేశినేని చిన్ని వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే రంగంలోకి దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అది చాలదన్నట్టు లోకేష్ పాదయాత్ర మొత్తం చిన్ని పర్యవేక్షించారు. దీంతో కేశినేని నాని పాదయాత్రకు దూరంగా ఉన్నారు. అయితే నానియే దూరంగా ఉన్నారా? పార్టీయే దూరంగా ఉంచిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ కేశినేని నాని ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణలో చంద్రబాబు పక్కన మెరిశారు. అటు తర్వాత విజయవాడ వచ్చి మూడోసారి పోటీకి సంకేతాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన భరోసాతోనే ఈ ప్రకటన చేయగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.