Hindupuram: హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులకు అచ్చొచ్చిన నియోజకవర్గం. బాలకృష్ణ ఇక్కడ రెండుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ వైసిపి సైతం బలంగా ఉన్నా… గ్రూపులు అధికంగా ఉన్నాయి. అదే మైనస్ గా మారి.. టిడిపికి ప్లస్ అవుతోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సైతం 2004,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఎంతలా అంటే అనామకులు సైతం అప్పట్లో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలో వర్గాలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలో సైతం కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఇక్బాల్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా దీపిక అనే మహిళను ఇన్చార్జిగా ప్రకటించారు. దీంతో ఇక్బాల్ వర్గం ఒకటి తయారైంది. దీపికకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని ఇక్బాల్ వర్గం తేల్చి చెబుతుందట. లోపాయికారీగా బాలకృష్ణకు సహకారం అందిస్తుంది అని ప్రచారం జరుగుతోంది.
ఇక నవీన్ నిశ్చల్ వర్గం గురించి చెప్పనక్కర్లేదు. గతంలో కాంగ్రెస్ టికెట్ రాలేదని ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. 2014లో వైసీపీ టికెట్ దక్కినా నెగ్గలేకపోయారు. 2019లో టిక్కెట్ దక్కలేదు. అప్పట్లో ఇక్బాల్ కు సహకరించలేదు. ఇప్పుడు కూడా దీపికకు సహకరిస్తారా లేదా అన్న అనుమానం వైసిపి హై కమాండ్ కు వెంటాడుతుంది. అయితే నవీన్ కు వైసిపి హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వాలిపోయారు. అటు ఇక్బాల్, ఇటు నవీన్ నిశ్చల్ వర్గాలతో సమావేశమయ్యారు. దీపికకు సహకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి