Jagan Vs Ramoji Rao: పాజిటివ్ ను పాజిటివ్ గా చూపించాలి. నెగిటివ్ ను నెగిటివ్ గా చూపించాలి. ఇదే మీడియా లక్షణంగా ఉండాలి. అలా కాకుండా రాజకీయరంగులు పులుముకుని అడ్డగోలుగా వార్తలు రాస్తే.. జనం దృష్టిలో చులకన అవుతుంది. ప్రస్తుతం తెలుగు నాట ఈనాడు పరిస్థితి అదే విధంగా ఉంది. గురువారం నాటికి ఆ సంస్థ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఏ మీడియా సంస్థ అయినా జనాల్లో ఆదరణ చూరగొనాలి అంటే విలువలు పాటించాలి. మరీ ముఖ్యంగా మీడియా సంస్థ అయితే వాటిని పాటించాలి. అదేం దౌర్భాగ్యమో తెలియదు గానీ ఈనాడు ఆ విలువల్ని ఏటికేడు తగ్గించుకుంటూ వస్తోంది. సమాచార హక్కు చట్టం, మద్యపాన నిషేధం, ఇంకా రకరకాల ఉద్యమాలు నడిపిన ఈనాడు ఇప్పుడు ఈ స్థాయికి పడిపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.
తెలుగు నాట 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మీడియా సంస్థ ఎలా ఉండాలి? ఎలాంటి విలువలు పాదుకొల్పాలి? ఎలాంటి వ్యవస్థ కోసం జనాల్ని తన రాతల ద్వారా కార్యోన్ముఖులను చేయాలి? కానీ వీటిని ఈనాడు పట్టించుకోవడం లేదు. కేవలం తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు మాత్రమే రాతలు రాస్తూ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రామోజీరావుకు విపరీతమైన ఆస్తులు ఉన్న నేపథ్యంలో చంద్రశేఖర రావు జోలికి ఈనాడు వెళ్ళదు. ఒక రకంగా అది నమస్తే తెలంగాణకు మించి డప్పు కొడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈనాడు కు పాత్రికేయ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. కానీ ఈ స్ఫూర్తికి పసుపు రంగు దట్టించడమే అసలైన విషాదం. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన సగటు స్థూల ఆదాయం, ఇంటింటికి పింఛన్లు, ఇతరత్రా పథకాలు ఇవేవీ ఈనాడుకు గుర్తుకు రావు. ఇప్పుడే కొత్తగా వరదలు వచ్చినట్టు, ఇప్పుడే కొత్తగా వైషమ్యాలు చోటు చేసుకుంటున్నట్టు రాస్తోంది.
వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు కొద్దిరోజుల పాటు సైలెంట్ అయింది. అప్పుడు జగన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే చంద్రబాబు రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావును కలిశాడో ఇప్పుడే ఆ పత్రిక ప్రాధాన్యాలు పూర్తిగా మారాయి. ఇక జగన్ మీద రాతలు రాయడం మొదలుపెట్టింది. సహజంగానే ఈనాడు పొడ గిట్టని జగన్ దాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం మొదలుపెట్టాడు. తమలపాకుతో రామోజీరావు ఒకటి ఇస్తే.. తలుపు చెక్కలతో జగన్ రెండు ఇవ్వడం మొదలుపెట్టాడు. సరే ఇది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు కానీ.. మార్గదర్శి రూపంలో రామోజీరావు అసలు రూపాన్ని జగన్ బయట పెడుతున్నాడు. ఇప్పటికే మార్గదర్శి సంస్థకు సంబంధించిన 800 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ సిఐడి ద్వారా అటాచ్ చేయించాడు. అంటే ఈ లెక్కన జగన్ సుద్ద పూస అని కాదు. ఆయన సాక్షి సొక్కం అని కాదు. కానీ ఈనాడు తాను న్యూట్రల్ అని చెప్పుకుంటుంది. పసుపుపచ్చ రంగు అద్దుకొని పోతురాజు మాదిరి డ్యాన్సులు చేస్తుంది. అది దానికి సాక్షికి తేడా!