Bhola Shankar- YCP: అనుకున్నట్టే జరుగుతోంది. మెగాస్టార్ నటించిన భోళాశంకర్ చిత్రానికి జగన్ సర్కార్ ముప్పు తిప్పలు పెడుతోంది. చిత్ర యూనిట్ కి చుక్కలు చూపిస్తోంది. చిరంజీవి తాజా కామెంట్స్ ప్రభావం ఆ చిత్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో పెట్టుకున్న దరఖాస్తుపై సవా లక్ష కొర్రీలు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టికెట్ల ధర పెంపుపై ఏపీ ప్రభుత్వానికి చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే చిరంజీవి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అదనపు సమాచారం పేరిట అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏపీలో 20% చిత్రీకరణ, హీరో హీరోయిన్ ల రెమ్యూనరేషన్ మినహాయించి.. 100 కోట్ల రూపాయల బడ్జెట్ కు సంబంధించి వివరాలు సమర్పించాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. ప్రస్తుతానికి దరఖాస్తును పెండింగ్ లో పెట్టింది. ఇంకా 24 గంటల వ్యవధి ఉన్న నేపథ్యంలో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజుల ఈవెంట్లో ఏపీ సర్కార్ పై చిరంజీవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. అభివృద్ధిని మరిచి పిచ్చుక లాంటి సినిమా రంగంపై బ్రహ్మాస్త్రం విసురుతారా అంటూ చిరంజీవి చురకలు అంటించారు. దీనిపై వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో చిరంజీవిపై విమర్శలు చెలరేగాయి. మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకు హాట్ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో భోళా శంకర్ సినిమా టిక్కెట్ల ధర పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం అనుకూలంగా ప్రకటిస్తుందో.. లేకుంటే మొండి చేయి చూపుతుందో చూడాలి మరి.