Earthquake: దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశంగా దక్కన్ పీఠభూమిగా పేర్కొన్న తెలంగాణ రాష్ట్రం పేరొందింది. హైదరాబాద్ అత్యంత సేఫ్ సిటీ అని.. ఇక్కడతోపాటు తెలంగాణ, విదర్భలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ అని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా ఉత్తర తెలంగాణలో భూకంపాలు రావడం అందరినీ షాక్ కు గురిచేసింది.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, మంచి ర్యాల జిల్లాలో భూకంపం వచ్చింది. భూమి మధ్యాహ్నం 2.03 గంటలకు కంపించడంతో జనాలు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది. దీంతో భూకంపం వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు.
శనివారం మధ్యాహ్నం 2.03గంటలకు ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కి.మీల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ప్రకటనలు భారీగా వచ్చాయి. మంచిర్యాలలోని రాంనగర్, గోసేవా మండల్ కాలనీ, నస్పూర్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు.
తెలంగాణలో ఇప్పటివరకూ భూకంపాలు నమోదు కాలేదు. కానీ తొలిసారి ఇలా భూమి కంపించడం కలకలం రేపింది. జనాలు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆరుబయటే సంచరించారు. ఈ ప్రకంపనలు ఆగుతాయా? కొనసాగుతాయా? అన్నది వేచిచూడాలి.