BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఆది నుంచి సైలెంట్ గా ఉంటున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా యాక్టివ్ అయ్యారు. హుజూరాబాద్ లో జాతీయ బద్ద విరోధులైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని.. గోల్కొండ రిసార్ట్ లో ఈటల, రేవంత్ రెడ్డి కలిశారని.. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏనాడు జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కలువలేదని..రెండు పార్టీలు బద్ద విరోధులని.. తెలంగాణలో ఎలా కలుస్తారని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ , బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి 2004లో కలిసి పోటీచేసి గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకున్న ఘనత టీఆర్ఎస్ సొంతమని విమర్శించారు.
ఇదంతా చూస్తుంటే.. హుజూరాబాద్ లో గెలుపు కోసం తిమ్మినిబమ్మిని చేసి నకిలీ ఆధారాలు సృష్టించి ప్రజలను గందరగోళం చేయాలనే కుట్ర దాగి ఉందని రఘునందన్ అనుమానం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో గెలుపు అనేది కేవలం వందల్లోనే ఉంటుందని.. ఇప్పుడు బీజేపీ ఇలా ఇతర పార్టీలతో కలిసి పోయిందని ఒకటి రెండు ఓట్ల శాతాన్ని ప్రభావితం చేసే కుట్ర సాగుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
హుజూరాబాద్ లో ఎవరెన్ని కుట్రలు చేసినా ఓట్ల శాతం కోసం కలిసిపోయాయని అన్ని ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని రఘునందన్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్ లు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు.