E-Challans New Rules : ఇది వరకు లాగా కాదు.. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోల్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఈ-చలాన్ వచ్చేస్తోంది. అలా వచ్చిన ఈ-చలాన్‌ను మీరు చెల్లించకపోతే మాత్రం ఇక మీదట భారీ నష్టాలు తప్పవు. ఈ-చలాన్‌లకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందుతున్నాయి. వీటిలో అనేక కొత్త అంశాలను చేర్చారు. ప్రస్తుతం దేశంలో జారీ అవుతున్న ఈ-చలాన్‌లలో కేవలం 40శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయి. దీంతో ఈ-చలాన్ వ్యవస్థను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలను రెడీ చేసింది.
Also Read : కొత్త జీవోలతో భారీగా పెరిగిన ట్రాఫిక్ చలాన్లు.. రోడ్డెక్కాలంటేనే వణికిపోతున్న జనాలు..!
టీఓఐ వార్తా కథనం ప్రకారం.. ప్రభుత్వం ఈ-చలాన్ వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక మార్పులు చేయనుంది. ముసాయిదా ప్రకారం.. కొత్త నిబంధనలలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం నుంచి బీమా ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి రావడం వరకు అనేక అంశాలు ఉండనున్నాయి. ఒకసారి వాటిపై దృష్టి సారిద్దాం…
ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి రెడ్ లైట్ జంప్ చేయడం నుంచి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలను 3 సార్లు చేస్తే, అతని లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుంది.
మీ ఈ-చలాన్‌లు పెండింగ్‌లో ఉంటే, మీరు కారు, బైక్ బీమాపై ఎక్కువ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరంలో 2 కంటే ఎక్కువ చలాన్‌లు పెండింగ్‌లో ఉంటే కూడా మీరు ఎక్కువ బీమా ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు.
ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించిన ప్రకారం.. ఈ-చలాన్ సమస్యలను కోర్టుకు తీసుకెళ్లినప్పుడు 80 శాతానికి పైగా కేసులు మాఫీ అవుతున్నాయి. దీనికి కారణం ప్రజలకు ఆలస్యంగా నోటిఫికేషన్ అందడం లేదా చలాన్ ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉండడమే. మరోవైపు, గణాంకాలు ఈ-చలాన్ రికవరీ రేటు చాలా తక్కువగా ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ఇది కేవలం 14 శాతం మాత్రమే ఉండగా, కర్ణాటకలో 21 శాతం, తమిళనాడు , ఉత్తరప్రదేశ్‌లో 27 శాతం, ఒడిశాలో 29 శాతం ఉంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాలో మాత్రమే వీటి రికవరీ రేటు 62 నుంచి 76 శాతం వరకు ఉంది.
Also Read : భార్య పై కోపంతో భర్త చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలా కూడా చేస్తారా ?