
ఏ మనిషికైనా రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఆకలి. రెండు ఆధిపత్యం. అందరి మొదటి ప్రాధాన్యం ఆకలి. అది తీరిన తర్వాత రెండో టార్గెట్ ఆధిపత్యం. ప్రపంచ దేశాలకు సైతం ఇదే వర్తిస్తుంది. అందుకే.. కొన్ని దేశాలు ఆకలితో అలమటిస్తుంటే.. అది తీరిన దేశాలు మాత్రం ఆధిపత్యం కోసం తపిస్తుంటాయి. ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల్లో ఆధిపత్య పోరాం రాజుకుంటోంది.
ప్రపంచ వ్యాపారంలో 50 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. చమురు మొదలు.. ఇనుప ఖనిజం వరకు అన్ని రకాల వాణిజ్యాలకు, రాకపోకలకు ఇదొక చక్కటి మార్గం. చైనాతోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ సహా.. ఆగ్నేయాసియా దేశాలన్నింటికీ ఈ రూటే కీలకం. అయితే.. ఈ మార్గంలో ఇప్పుడు ఆయుధ పోటీ నెలకొంది. పలు దేశాలు యుద్ధ సామగ్రిని మొహరిస్తున్నాయి.
ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి. సముద్ర దొంగలు, ఉగ్రవాదుల నుంచి తీరదేశాలకు రక్షణ పేరుతో అమెరికా తమ షిప్పులను తిప్పుతోంది. కానీ.. అంతిమ లక్ష్యం అధిపత్యమే అని అంటారు విశ్లేషకులు. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా.. తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికే ఈ యుద్ధ నౌకలను ఈ మార్గంలో ఉంచుతోందని అంటారు. ఈ యుద్ధనౌకలతోపాటు యుద్ధ విమానాలు కూడా తిరుగుతుంటాయి. సముద్రం మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇవి తిరుగులేని సాధనాలుగా చెబుతారు.
దీంతో.. చైనా కూడా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం ఆరు విమాన వాహక యుద్ధ నౌకల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు రెండు నౌకలను సముద్రంలోకి దింపింది. ఇందులో ఒకటి 1998లోనే ప్రవేశపెట్టగా.. రెండోది 2012లో జలప్రవేశం చేసింది. ఈ సంవత్సరం చివరికల్లా మూడో నౌకను దింపేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగోదాని నిర్మాణం కూడా ప్రారంభమైందని చెబుతున్నారు.
భారత్ కు ఒక విమాన వాహక నౌక విక్రమాదిత్య ఉంది. వచ్చే ఏడాది రెండోది విక్రాంత్ ను దించేందుకు ప్రయత్నిస్తోంది. 2030 లోపే మూడో నౌక విశాల్ ను కూడా జలప్రవేశం చేయించాలని చూస్తోంది. జపాన్ కూడా తక్కువ స్థాయి నౌకలను సిద్ధం చేసుకుంటోంది. దక్షిణ కొరియా కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. ఈ విధంగా సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్న దేశాలతోపాటు.. ఎక్కడో ఉన్న అమెరికా కూడా ఇక్కడ యుద్ధ నౌకలను రంగంలోకి దించుతుండడంతో.. సముద్రంలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, మున్ముందు ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.