Gujarat And Himachal Pradesh Elections: ఎన్నికల్లో ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా నాయకులు అంతిమంగా ఆలోచించేది గెలుపు గురించి.. అధికారం గురించి.. ఒకప్పుడు అంటే రాజకీయాల్లో విలువలు ఉండేవి.. ఇప్పుడు విలువలు, వలువలు రెండూ లేవు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మనుగోడు ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో ధన ప్రవాహం సాగిందో కళ్ళారా చూశాం. మునుముందు రోజుల్లో ఇది ఏ స్థాయికి చేరుకుంటుందో అర్థం కాని పరిస్థితి. కేవలం ఒక్క మునుగోడు ఉప ఎన్నికల్లో 672 కోట్లు ఖర్చయిందనే అంచనాలున్నాయి. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సరే మునుగోడు విషయం పక్కన పెడితే.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. భారతీయ జనతా పార్టీ మరో మారు గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఇప్పటికే రెండు దశల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఇక హిమాలయ పర్వతాల్లో రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తోంది. అయితే ప్రతిపక్షాలకు ముకుతాడు వేసేలా బిజెపి కొత్త ఎత్తులకు రంగం సిద్ధం చేసింది.

బాండ్ల పథకం ద్వారా
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదు సంవత్సరాలలో లభించిన దాదాపు 10,800 కోట్ల విరాళాల్లో 8000 కోట్లకు పైగా విరాళాలను బీజెపి చేక్కించుకుంది.. ఇప్పుడు తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో భారీ మొత్తంలో నిధులు సేకరించేందుకు కొత్త ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎలక్టోరల్ బండ్ల పథకంలో కేంద్ర ఆర్థిక శాఖ హడావిడిగా సవరణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా 15 రోజులు, సార్వత్రిక ఎన్నికలు జరిగే ఏడాదిలో 30 రోజులు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు అవకాశం కల్పించింది.. ఇప్పటివరకు ఉన్న 40 రోజులతో కలిపి మొత్తంగా ఏడాదికి 85 రోజులు పొడిగించింది. ఈ మేరకు గత సోమవారం 23వ దఫా బాండ్ల జారీకి ప్రకటన విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఎస్బిఐ కేంద్రాల్లో బుధవారం నుంచి మొదలైన బాండ్ల అమ్మకాలు నవంబర్ 15 వరకు కొనసాగుతాయి..
ఇక్కడే ఉంది మెలిక
రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించకుండా, ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వకుండా, ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక బాండ్ల జారీ గడువు ఎలా పెంచుతారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి శనివారం పోలింగ్ జరగనున్నది. డిసెంబర్ 1, 5 తేదీలలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆర్థికంగా లబ్ధి పొందెందుకే మోదీ సర్కార్ ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డిజిటల్ ఎలక్టోరల్ బాండ్లతో పోలిస్తే, ఫిజికల్ ఎలక్టోరల్ బాండ్లలో పారదర్శకత పై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. న్ అయితే ఎన్నికలు జరిగేందుకు ముందు డిజిటల్ బాండ్ల విక్రయాలతో పోలిస్తే ఫిజికల్ బాండ్ల విక్రయాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2019 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు ఫిజికల్ బాండ్ల కొనుగోలు ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

అందుకోసమేనా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమే మోడీ సర్కార్ ఎలక్టో ల్ బాండ్ల అమ్మకాన్ని మరో 15 రోజులు పొడగించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు గింగిరాలు తిరుగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచేందుకు సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగిస్తున్న భారతీయ జనతా పార్టీ.. అంది వచ్చే అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అయితే ఈసారి కూడా ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి..