Chandrababu Bail: చంద్రబాబు తన బెయిల్ కోసం తెలంగాణ టిడిపిని బలి పెట్టారా? తెలంగాణ ఎన్నికల నుంచి టిడిపి తప్పుకున్నట్టు ప్రకటన చేసిన తర్వాత ఆయనకు ఉపశమనం కలగడం దేనికి సంకేతం? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 28 వరకు ఆయన బెయిల్ లో ఉంటారు.
దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభించింది. దేశంలో పేరు మోసిన లాయర్లంతా చంద్రబాబు కోసం పనిచేశారు. అయినా సరే ఎక్కడా ఊరట దక్కలేదు. అటు చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్రను నిలిపి వేసి మరి తండ్రి కోసం న్యాయపోరాటం చేశారు. సుమారు నెలరోజుల పాటు ఢిల్లీలో పైగాపులు కాశారు. ఇటువంటి తరుణంలోనే లోకేష్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షా కబురు పంపారు. లోకేష్ తో చర్చించారు. ఆ సమయంలో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వర సైతం ఉన్నారు. అయితే తనను అమిత్ షా కలవాలని కోరారని.. అందుకే ఆయనను కలిశానని.. న్యాయం వైపు ఉండాలని కోరానని.. ఆయన తనకు ధైర్యం ఇచ్చారని.. సుప్రీంకోర్టులో ఏ బెంచ్ లో చంద్రబాబు కేసు ఉందని తెలుసుకున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు.
అయితే అదే సమయంలో కిషన్ రెడ్డి సైతం స్పందించారు. లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్ కోరారని.. తీరిక లేకపోవడంతో కలవలేకపోయారని.. కొంచెం సమయం దొరకడంతో తన ద్వారా లోకేష్ కబురు పంపారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో.. తెలంగాణలో బిజెపి సపోర్ట్ కోసమే లోకేష్ ను పిలిచారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయమని ప్రకటించిన తరువాత.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. బిజెపి అగ్ర నేతల సహకారంతోనే చంద్రబాబు బెయిల్ పొందగలిగారని టాక్ ప్రారంభమైంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి. ఒకవేళ కానీ తెలంగాణలో బిజెపికి టిడిపి మద్దతు ప్రకటిస్తే మాత్రం మరింత అనుమానాలు బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.