Volunteer Petition On Pawan: పవన్ విషయంలో వైసీపీ సర్కారుకు కోర్టులో చుక్కెదురయ్యింది. వలంటీర్ల వ్యవస్థపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళా వలంటీరు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సదరు మహిళా వలంటీర్ పిటీషన్ ను కోర్టు స్వీకరించలేదు. అసలు వలంటీరు నియామక పత్రం జత చేయకుండా పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు తిరస్కరించింది. దీంతో వైసీపీ సర్కారు పరువుపోయినంత పని అయ్యింది. బాధితురాలిగా కోర్టును ఆశ్రయించిన మహిళా వలంటీరు వెనుక ఉన్నది ముమ్మాటికీ వైసీపీ సర్కారే. ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలో తెలియక జగన్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. వలంటీరు అంటే స్వచ్ఛంద సేవ. కానీ దానికి నెలకు రూ.5 వేలు చొప్పున సేవలకు రేటు కట్టి అందిస్తున్నారు. అందుకే కోర్టులో వివరాలన్నీ అందిస్తే లోపాలు బయటపడే చాన్స్ ఉంది.
వలంటీరు వ్యవస్థపై పవన్ ఓ పద్ధతి ప్రకారం దాడి చేశారు. ఆ వ్యవస్థలో లోపాలను మాత్రమే ఎత్తిచూపారు. నిరుద్యోగం మాటున వలంటీర్లతో ప్రభుత్వం ఊడిగం చేస్తోందని తప్పుపట్టారు. వ్యక్తిగతంగా వలంటీర్లపై తనకు కోపం లేదని.. దాని వెనుక ఉన్న రాజకీయ వ్యవస్థపైనేనంటూ కామెంట్స్ చేశారు. ప్రజల వ్యక్తిగత, గోప్యతా సమాచారం బయటపెడుతున్నందునే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయకుండా పవన్ పై ఎదురుదాడికి దిగింది. ఏకంగా ప్రాసిక్యూషన్ కు అనుమితిచ్చింది. అంతటితో చాలదన్నట్టు ఓ సచివాలయ ఉద్యోగితో పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయించింది. ఇప్పుడు విజయవాడకు చెందిన ఓ మహిళా వలంటీరుతో కోర్టులో కేసు వేయించి చేతులు కాల్చుకుంది. కోర్టు అడిగిన వివరాలు ఇవ్వలేక సతమతమవుతోంది.
వలంటీరు వ్యవస్థకు చట్టబద్ధత లేదు. ఈ విషయం జగన్ సర్కారుకు తెలియంది కాదు. వలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ ను అడేసుకోవాలని జగన్ సర్కారు చూసింది. ప్రాసిక్యూషన్ కు అనుమతితో పాటు ముప్పేట కేసులు నమోదుచేయాలని భావించింది. మహిళా వలంటీరును పావుగా వాడుకుంది. అయితే తాను వలంటీరునని ధ్రువీకరణ చూపడం పిటీషనర్ కు అనివార్యంగా మారింది. అదే నియామకపత్రం అందిస్తే.. ఏ ప్రాతిపదికన నియామకం చేశారు. వలంటీరు సేవలకు ప్రభుత్వం తరుపున నగదు ఎందుకు చెల్లిస్తున్నారు? వంటివి ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తోంది. కేసు వాదిస్తున్న లాయర్లు మాత్రం పవన్ కోర్టుకు రాక తప్పని పరిస్థితి అని.. ఏవేవో మాటలు చెబుతున్నారు. అయితే జగన్ సర్కారు లేని సమస్యను కొని తెచ్చుకున్నట్టయ్యింది.