Mamata Banerjee- CM KCR: రాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే దిశగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఇంకోవైపు బెంగాల్ సీఎం, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా విపక్షాలతో సమావేశమే ఏర్పాటు చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందని.. దానికి హాజరుకావాలని సోనియా సహా దేశంలోని వివిధ విపక్షాలకు చెందిన 22 మంది నేతలకు శనివారం లేఖ రాశారు. ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, పి.విజయన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, భగవంత్ సింగ్ మాన్, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ అధ్యక్షులు శరద్‌పవార్, అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు-కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఎస్‌డీఎఫ్ అధినేత పవన్ చామ్లింగ్, ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ వీరిలో ఉన్నారు.ఏపీ సీఎం జగన్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి లేఖ పంపలేదు.
బీజేపీ పక్షాన సీఎం జగన్..
తెలుగు రాష్ట్రాలను దీదీ పెద్దగా పట్టించుకోలేదు. ఒక్క తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు మాత్రమే ఆహ్వానం అందింది. ఏపీ విషయానికి వస్తే సీఎం జగన్‌ను మమతా బెనర్జీ బీజేపీ మిత్రపక్షాల జాబితాలో చేర్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పెద్దగా ఓటింగ్ లేకపోవడంతో టీడీపీ అధినేతను కూడా పట్టించుకున్నట్లుగా లేరు.
Also Read: Chai Business: సండే స్పెషల్: చాయ్ వేలకోట్ల వ్యాపారం ఎలా అయ్యింది?
పైగా జాతీయ రాజకీయాల విషయంలో చంద్రబాబు పూర్తిగా ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్ మాత్రమే పూర్తి స్థాయిలో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలపై కొంత కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఈ భేటీకి కేసీఆర్ వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న కేసీఆర్ పోల్ పొజిషన్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే అనుకూలమైన పరిణామాలు జరగడం లేదు. దీంతో సైలెంట్ అయ్యారు. నెలాఖరులో జాతీయ పార్టీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ లోపే మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలుద్దామని ముహుర్తం ఖరారు చేశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను మమత బెనర్జీ ఆహ్వానించారు.
విపక్షాలను ఏకతాటిపైకి..
దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రతిఘటించేందుకు.. ప్రగతిశీల శక్తులన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని మమతా బెనర్జీ తన లేఖలో పిలుపిచ్చారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని, అంతర్జాతీయంగా దే శ ప్రతిష్ఠ దెబ్బతిందని.. దేశంలో తీవ్ర కలహాలతో కూడిన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. దేశంలో ప్రగతిశీల ప్రజాస్వామిక పార్టీలన్నీ కలిసి భవిష్యత్ రాజకీయ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్రపతి ఎన్నికలు వీలు కల్పిస్తున్నాయి. మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే రాజ్యాంగాధినేత ఎవరో నిర్ణయించేందుకు ప్రజాప్రతినిధులకు అవకాశం లభిస్తున్నందున ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. మన ప్రజాస్వామ్యం సంక్షోభానికి గురవుతున్న నేటి సమయంలో వివిధ ప్రతిపక్షాల నేతలు సమావేశమై ఫలవంతమైన చర్చలు జరపడం నేటి అవసరం అని మమతా తెలిపారు. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే పనిలో మమతా పడ్డారు. కానీ అందులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం అంతంతే.
Also Read:Internal Conflicts In YCP: జగన్ కు కొత్త తలనొప్పులు.. పార్టీలో అసలేం జరుగుతోంది?