BT3 Cotton Seeds: తెల్లబంగారం గా పిలిచే పత్తి రైతులకు వి”పత్తిని ” కలిగిస్తోంది. కార్పొరేట్ కంపెనీలు ఆడే ఆటలో చేనూ చెలకను పీల్చిపిప్పి చేస్తోంది. నిషేధిత బీటీ3 పత్తి విత్తనాల వాడకం ఏటా పెరుగుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సైంటిఫిక్‌గా హెచ్‌టీబీటీ (హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ) గా పిలిచే ఈ బోల్‌గార్డ్ విత్తనాలు ఇప్పటికే ఊరూరూ చేరుకున్నాయి. రాష్ట్రంలో ఈ సారి 70 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యవసాయ శాఖ, రైతులకు మేలు రకాల విత్తనాలు అందించడంలో విఫలమైంది. సాగు విస్తీర్ణం పెంచడంపై ఉన్న శ్రద్ధ.. నాణ్యమైన విత్తనాలు అందించడంలో సర్కారుకు లేకుండాపోయింది.
ఏం కసరత్తు చేశారు?
వారం రోజుల కిందట పంటల సాగు సన్నాహక సమావేశాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు పెంచాలని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కానీ నిషేధిత బీటీ3 విత్తనాలు, నకిలీ విత్తనాలను నియంత్రించే వ్యవస్థలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. హెచ్‌టీబీటీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఊరూపేరూ లేని సీడ్ కంపెనీలు రైతులకు హెచ్‌టీబీటీ విత్తనాలను అంటగడుతున్నాయి. రైతులు కూడా కలుపు తీసే బాధ తప్పుతుందని బీటీ3 విత్తనాల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రెండు, మూడేండ్ల కింది వరకు పత్తి సాగులో 30 శాతంగా ఉన్న హెచ్‌టీ పత్తి విత్తనాల వాటా ప్రస్తుతం 40 నుంచి 50 శాతానికి చేరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏంటీ హెచ్‌టీబీటీ?
పత్తిలో శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగును నివారించేందుకు అమెరికాకు చెందిన మోన్శాంటో కంపెనీ బీటీ టెక్నాలజీని డెవలప్‌చేసింది. నేలలో ఉండే బాసిల్లస్ తురింజియెన్సిస్ (బీటీ) అనేవి విషంలా పనిచేస్తాయి. ప్రారంభంలో పత్తిని ఆశించే పురుగులపై హెచ్‌టీబీటీ టెక్నాలజీ సక్సెస్ అయ్యింది. 2002లో బీటీ-1 పత్తి . ప్రారంభంలో పత్తిని ఆశించే పురుగులపై హెచ్‌టీబీటీ టెక్నాలజీ సక్సెస్ అయ్యింది. 2002లో బీటీ-1 పత్తి విత్తనాలు దేశంలో ప్రవేశించగా, 2006 దాకా అన్ని రకాల పురుగులను ఎదుర్కొన్నాయి. క్రమేణా బీటీ-1 టెక్నాలజీ గులాబీ రంగు పురుగును నాశనం చేసే శక్తిని కోల్పోయింది. దాని స్థానంలో మోన్శాంటో బీటీ-2 టెక్నాలజీని తీసుకొచ్చింది. 2012 నాటికి గులాబీ రంగు పురుగు దీన్నీ తట్టుకుని మొండిగా తయారైంది. దీంతో పురుగులతోపాటు గ్లైఫోసేట్లాంటి కలుపు మందును కూడా తట్టుకునేలా మోన్శాంటో కంపెనీ బీటీ-3 గా చెప్పుకునే హెచ్‌టీబీటీ టెక్నాలజీ తీసుకొచ్చింది. దాని వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని తేలడంతో మన దేశంలో కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇండియా లాంటి మార్కెట్‌ను వదులుకోవడం ఇష్టం లేని మోన్శాంటో ప్రయోగాలకోసం అనుమతి పొంది దేశంలో ప్రవేశించింది. తర్వాత దేశీయ కంపెనీలు, వాటి నుంచి చిన్న కంపెనీలు హెచ్‌టీబీటీ విత్తనాల ఉత్పత్తి, రవాణా మొదలుపెట్టాయి. ఏజెంట్లను పెట్టుకొని అక్రమ మార్గాల్లో రైతులకు చేరవేస్తున్నాయి.
గడ్డి మందే యమ డేంజర్
అమెరికాలో వ్యవసాయ కూలీల కొరత వల్ల పత్తి, మక్క, సోయాబిన్ పంటల్లో కలుపు నివారణకు బీటీ-3 టెక్నాలజీ వాడుతున్నారు. హెచ్‌టీబీటీ పంటల్లో గ్లైఫోసేట్ పిచికారీ చేస్తే ప్రధాన పంట తప్ప మిగిలిన మొక్కలన్నీ నశిస్తాయి. గ్లైఫోసేట్150 కన్నా ఎక్కువ గడ్డి జాతులను, మొక్కలను నాశనం చేస్తుందని, తద్వారా జీవవైవిధ్యం దెబ్బతింటోందని పలు స్టడీల్లో తేలింది. బీటీ 3 విత్తనాల్లో గ్లైఫోసేట్‌ను తట్టుకునే జన్యువులను చొప్పించడంతో మొక్కలు విషపూరితమవుతాయి. చిన్న కమతాల్లో గ్లైఫోసేట్ వాడితే పక్క పొలాల్లో సాగుచేస్తున్న ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదముంది. మోతాదుకు మించి స్ప్రే చేస్తుండడం వల్ల వీటి అవశేషాలు భూమిలోనే ఉండిపోతున్నాయి. ఈ రసాయనాలకు ఇంకే గుణం ఉండడంతో భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి. అజాగ్రత్త వల్ల రైతులు క్యాన్సర్లు, నరాల జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని స్డడీస్ చెప్తున్నాయి. పత్తి నుంచి పక్కనే ఉన్న ఇతర పంటల్లోకి, అక్కడి నుంచి ఆహార పదార్థాల్లోకి, ఆఖరికి రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్‌లోని ఆహార నమూనాల్లోనూ గ్లైఫోసేట్ జాడలున్నాయని పలు స్టడీలు వెల్లడించాయి. ఈ విత్తనాల వల్ల తాము, తమ వాళ్లు క్యాన్సర్ బారిన పడ్డామని అమెరికాలో మోన్శాంటో కంపెనీపై 300కిపైగా దావాలు నడుస్తున్నాయి.
కఠిన శిక్షలున్నా…
భారీ స్థాయిలో పత్తి చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. ఆ స్థాయిలో మేలురకం హైబ్రీడ్ విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యతను వదిలేసింది. దీంతో రాష్ట్రంలోకి పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రతో పాటు ఏపీలోని గుంటూరు, కర్నూల్, నంద్యాల నుంచి బీటీ 2 పేరుతో హెచ్‌టీబీటీ పత్తి విత్తనాలు వెల్లువలా వస్తున్నాయి. మార్కెట్‌లో 450 గ్రాముల బీటీ 2 ప్యాకెట్రేటు రూ.786 నుంచి రూ.810 ఉండగా హెచ్‌టీబీటీ ప్యాకెట్లను మాత్రం వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు. లూజ్ విత్తనాలైతే కిలోకు రూ.1,800 నుంచి రూ.2,500కే ఇస్తున్నారు. ఈ సీడ్స్ సరఫరా చేస్తూ పట్టుబడితే పర్యావరణ పరిరక్షణ చట్టం– 1986 ప్రకారం ఏడేండ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష దాకా జరిమానా విధించవచ్చు. విత్తన కంపెనీలు, డీలర్లకు అధికారంలో ఉన్న పెద్దల అండదండలు ఉండడం, గ్రామాల్లో ఏజెంట్లుగా ఎక్కువ మంది రూలింగ్పార్టీ లీడర్లే చక్రం తిప్పుతుండడంతో ఆఫీసర్లు చర్యలకు వెనుకాడుతున్నారు. జిల్లాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పోలీసులతో కూడిన టాస్క్ఫోర్స్టీమ్లను వేసినా పోలీసులే అడపాదడపా బీటీ3 విత్తనాలను పట్టుకుంటున్నారు. గత సీజన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 30 శాతానికి పైగా బీటీ-3 రకమే సాగైంది. ఈ సారి సాగు విస్తీర్ణం 50 శాతానికి చేరవచ్చనే అంచనా ఉంది.
రైతులకు అన్ని విధాలా నష్టం
గ్లైఫోసేట్ ఎక్కువ సార్లు పిచికారీ చేస్తుండడంతో నేలలో ఉండే మిత్రపురుగులు, వానపాములు నశించి భూమి గుల్ల బారే ప్రక్రియ నిలిచిపోతున్నది. పొడిగా ఉండాల్సిన నేల గట్టి కేకులా తయారవుతున్నదని, ఆ భూముల్లో ఇతర పంటలేవీ పండని స్థాయిలో నిస్సారమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. దొంగచాటుగా వస్తున్న విత్తనాలన్నీ ఇల్లీగల్ కావడంతో పంట నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం అందడం లేదు. కొన్ని చోట్ల హెచ్‌టీబీటీ పేరుతో నాన్‌బీటీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. నాన్‌బీటీ పంటలపై గ్లైఫోసేట్ స్ర్పే చేసినప్పుడు పంట ఎండిపోయి, రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హెచ్‌టీబీటీ విత్తనాల వల్ల మన దగ్గర గులాబీ రంగు పురుగు మరింత రోగనిరోధకశక్తిని పెంచుకుందని అగ్రికల్చర్ సైంటిస్టులు అంటున్నారు. గులాబీ రంగు పురుగు ఉధృతి తీవ్రమై పంట నష్టం జరుగుతున్నదని చెప్తున్నారు. దీంతో రైతులు మళ్లీ మళ్లీ పురుగుల మందులు స్ర్పే చేస్తున్నారని, ఫలితంగా పెట్టుబడులు పెరగడంతోపాటు పర్యావరణానికి, రైతుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని హెచ్చరిస్తున్నారు. హెచ్‌టీబీటీ విత్తనాల వల్ల పత్తి దిగుబడులు తగ్గుతున్నాయి. మొదట్లో ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పినా.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకు మించట్లేదు. గతేడాది ఎకరాకు 2.5 –3.5 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది.
Also Read:Internal Conflicts In YCP: జగన్ కు కొత్త తలనొప్పులు.. పార్టీలో అసలేం జరుగుతోంది?