Siddam Sabha: ఏపీలో అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. సీఎం జగన్ సిద్ధం సభల ద్వారా సమర శంఖం పూరించారు. మూడు ప్రాంతాల్లో సభలు పూర్తి చేశారు. లక్షలాది మందితో సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అటు నారా లోకేష్ సైతం ఉత్తరాంధ్రలో శంఖారావసభలు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ఈ ప్రచార సభలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సైతం రా కదలిరా పేరిట ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు లో నిర్వహించిన సిద్ధం సభకు దాదాపు పది లక్షల మంది హాజరైనట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండు లక్షలకు మించి జనాలు రాలేదని టిడిపి అనుకూల మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ చేసిన ట్విట్ వైరల్ అవుతోంది. సీఎం జగన్ టార్గెట్ చేసుకొని లోకేష్ కీలక ప్రశ్న వేశారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను జతచేస్తూ పోస్ట్ చేశారు.
రాప్తాడులో గంటసేపు సీఎం జగన్ ప్రసంగించారు. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. వైసిపి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితేనే ఓటు వేయాలని ప్రజలకు అభ్యర్థించారు. తనకు బలం తగ్గిందని, ప్రజాదరణ లేదని చంద్రబాబు చెబుతున్నారని… అటువంటప్పుడు ఎందుకు పొత్తులకు ఆరాటపడుతున్నారని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క పథకం అయినా ఇచ్చారా అంటూ నిలదీశారు. మళ్లీ చంద్రముఖి పైకి లేస్తుందని ఎద్దేవా చేశారు.
అయితే సిద్ధం సభ చంద్రబాబు చుట్టూ తిరగడం విశేషం. ఈ తరుణంలో నారా లోకేష్ ఒక ట్విట్ చేశారు. రాప్తాడు సభలో చంద్రబాబు నామస్మరణ చేశారని.. గంట ప్రసంగంలో జగన్ 108 సార్లు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారని.. చంద్రబాబు భజన చేసేందుకు సిద్ధం సభలు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేస్తూ.. సభకు సంబంధించి వీడియోను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిని టిడిపి శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా సైతం లోకేష్ ను టార్గెట్ చేసుకుంది. రకరకాల పోస్టులు పెడుతోంది.