
ఏపీ ప్రభుత్వ పాలనలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో పాలకవర్గం సతమతమవుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయాసలు పడుతున్నా.. ఆర్థిక కష్టాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదురైన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలనే ఆలోచనలతో ప్రభుత్వం తలమునకలవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కొన్ని హామీల విషయంలో వెనకడుగు వేసినట్లు ప్రచారం సాగుతోంది.
ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. వీటిని విస్తరించి 25 జిల్లాలుగా మార్చాలని అనుకున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అది సాధ్యం కాదనే పార్టీలోని కొందరు నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలు విస్తరించాలంటే ప్రత్యేకంగా అధికారులను నియమించాల్సి ఉంటుంది. హెడ్ క్వార్టర్లు సెట్ చేయాలి. మరోవైపు జిల్లాల ఏర్పాటుతో రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనూ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వ ఖజానాకు ఖాళీ ఏర్పడింది. దీంతో అప్పుల కోసం కేంద్రాన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర పాలనకే ఆర్థిక అవసరాలు సరిపోతాయి. ఇక ఈ సమయంలో కొత్త హామీల జోలికి వెళితే ఇబ్బందులు పడుతాయని సన్నిహితుల సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం జిల్లాలను విస్తరించి.. అప్పటి వరకు బాగానే అనిపించుకున్నా రాను రాను ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అక్కడి పరిస్థితిని గమనించిన జగన్ తాను కూడా జిల్లాల జోలికి వెళ్లకూడదనే అనుకున్నారట. ఇవే కాక జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి ఉద్యమం ఏర్పడే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుతో ప్రజా వ్యతిరేకత ఏర్పడితే ప్రమాదం ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారట.