మరోవంక, నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పష్టం చేశారు. రెండు వారాలపాటు క్వారంటైన్ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు.
కరోనాను క్రమశిక్షణతోనే గెలవగలమని ముఖ్యమంత్రి చెబుతూ నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని, కరోనాపై చర్యలకు ప్రజలంతా సహకరించాలని సీఎం కోరారు.
రాత్రి తెలంగాణ సరిహద్దులో చాలా మంది నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ వారిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. రాత్రి రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఏప్రిల్ 14వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండగలిగితే కరోనా కాంటాక్ట్ కేసులను గుర్తించగలుగుతామని పేర్కొన్నారు. తిరగడం మొదలు పెడితే గుర్తించడం కష్టం అవుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఏపీకి వచ్చినవారందరినీ క్వారంటైన్‌కు తరలించకతప్పదు. టెస్టులు చేయించుకున్న తర్వాతే స్వస్థలాలకు వెళ్లాలి. సీఎం కేసీఆర్‌తో మాట్లాడా, సానుకూలంగా స్పందించారు. భోజనం, వసతి కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. దేశం ఎక్కడ చిక్కుకున్నవారైనా కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే… కేంద్రం వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుంది” అని జగన్ వివరించారు.
ఏపీలో ఇప్పటివరకు కేవలం 10 కేసులే నమోదయ్యాయని చెబుతూ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా ఉంచామని చెబుతూ విదేశాల నుంచి రాష్ట్రానికి 27,818మంది వచ్చారని చెప్పారు.