TRS MLAs Purchase Case: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ‘ఎర’ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. శుక్రవారం లీకైన రెండు ఆడియో కాల్స్, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌తో ఈ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ సంస్ధాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ పేర్లు ఆడియో కాల్స్‌లో వినిపించడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కాగా, ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పొందుపర్చారు. ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పేర్కొన్నారు. అంతేగాక, ప్రత్యేక ఆపరేషన్లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు వెల్లడించారు.

నందకుమార్ డైరీలో 50 మంది ఎమ్మెల్యేల జాతకం..
ఇక పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ డైరీలో 50 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పేర్లు, వారికి సబంధించిన డీల్ వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ 50 మంది పేర్లను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. దీంతో ఆ 50 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార టీఆర్‌ఎస్ వర్గాల్లో కూడా ఈ విషయం గుబులు రేపుతోంది. ఆ 50 మంది ఎవరనే దానిపై గులాబీ వర్గల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. 50 మందిలో ఇప్పటికప్పుడు బీజేపీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు ‘సంతోష్ బీజేపీ’ అనే పేరుతో ఉన్న నంబర్‌కు రామచంద్రభారతి స్వామీజీ వాట్సప్ మెస్సేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకేనా..
ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పడంతో.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రాజకీయ వర్గాల భావిస్తున్నాయి. ఒకేసారి అందరూ పార్టీలో చేరితే అనుమానం వస్తుందనే భావనతో విడతల వారీగా ఎమ్మెల్యేలతో నిందుతులు సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదుగురు చొప్పున విడతల వారీగా బీజేపీలో చేరిపించేందుకు ప్లాన్ వేశారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
అనుమానాలు అనేకం..
కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనేక అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అసవరం ఏమిటనేది మిలియన్ డాలర్లు ప్రశ్నగా మారింది. ఒక సంవత్సరం అధికారం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేసిందా? అనే అనుమానాలు ఉత్పత్తమవుతున్నాయి. కేవలం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలపడే అవకాశముంటుందని, అంతేకానీ ఏడాదిలో ఎన్నికలు ఉండగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ ఉంటుందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోన్నాయి.

ముగ్గురి ఫోన్లు, నందు డైరీ సీజ్..
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులు నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ బన్సల్ కు రామచంద్రభారతి పంపిన ఎంఎంఎస్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. రామచంద్రభారతి, నందు వాట్సాప్ సంభాషణల స్క్రీట్స్ మొత్తం ఉన్నాయి. కారులో ఉన్న నందు డైరీ కూడా సీజ్ చేశాం. అందులో 50 మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి.