Munugode By Election TV9 Survey : తెలంగాణ సమాజం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు అసలు సిసలు టాపిక్. ఇక్కడ గెలుపు కోసం కేంద్రంలోని బీజేపీ సామధానబేధ దండోపాయాలు ఉపయోగిస్తోంది. ఇక ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలకు ముందు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేశాయి. ఇక అధికార టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని గెలవనీయకూడదని చేయని ప్రయత్నం లేదు. మధ్యలో అసలు ఈ సీటు హక్కుదారు అయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి తమ సీటును తాము చేజిక్కించుకోవాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే మూడు పార్టీల సమరంలో మునుగోడులో మందు, విందు, నగదు ఏరులై పారుతోంది. కోట్ల డబ్బు ఖర్చు చేస్తున్న ఈ సమరంలో అందరూ ఊహిస్తున్నది క్షేత్రస్థాయిలో లేదని అర్థమవుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ప్రధాన పోటీదారుగా అందరూ భావిస్తున్నారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ వీక్ అని.. ఆయన పోటీ ఇవ్వలేకపోతున్నారని అనుకున్నారు. ఇక కాంగ్రెస్ కూడా బలంగా ఉందంటున్నారు. ముక్కోణపు పోటీ అని అందరూ భావిస్తున్న వేళ తెలుగు న్యూస్ చానల్స్ లోనే ప్రముఖ మీడియా టీవీ9 సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఇందులో షాకింగ్ లెక్కలు బయటపడ్డాయి.
మునుగోడులో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయినట్టు టీవీ9 సర్వేలో తేలింది. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందని.. వీరిద్దరి మధ్య ఓట్ల శాతం కేవలం 2 నుంచి 3శాతం లోపేనని సర్వేలో బయటపడింది. అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే మునుగోడులో హోరాహోరీ నడుస్తోందిన అర్థమవుతోంది.
టీఆర్ఎస్ సర్వేలో మునుగోడు నియోజకవర్గంలోని 9 ముఖ్యమైన మండలాలు, గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో మునుగోడులో 35-37 శాతం టీఆర్ఎస్ కు ఓట్లు పడుతాయని తేలింది. ఇక కాంగ్రెస్ కు 33-35 శాతం , బీజేపీకి కేవలం 19-21 శాతం అని తేలింది. బీఎస్పీకి 4-7 శాతం పడుతాయని తేలింది.

ఇక చందూర్, చందూర్ టౌన్, గట్టుపల్లి, చౌటుప్పల్, నాంపల్లి, చౌటుప్పల్ టౌన్, నారాయణపురం, మర్రిగడ్డల్లో కూడా టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య సరాసరిగా 35 నుంచి 40 శాతం ఓట్ల చొప్పున వచ్చాయి. బీజేపీ ఓట్ల శఆతం 20కి అటూ ఇటూగా దాటకపోవడం గమనార్హం.
దీన్ని బట్టి ఓవరాల్ గా చూసుకుంటే మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉండనుందని తెలుస్తోంది. నారాయణపురంలో మాత్రం కాంగ్రెస్ కు 42 శాతం, టీఆర్ఎస్ 33 శాతంతో వెనుకబడింది. మిగతా అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్ కేవలం 1 లేదా 2 స్థానాలతో ముందంజలో ఉండడం విశేషం.
అయితే లీక్ అయిన ఈ సర్వే నిజంగానే టీవీ9 చేసిందా? లేక సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయిన ఒట్టి ప్రచారమా? అన్నది తేలాల్సి ఉంది.