Russia: చేసింది మహా నేరం: రష్యాను చరిత్ర క్షమించదు

అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ కు నోవా కఖోవ్కా ఆనకట్ట ను ధ్వంసం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటని వెస్ట్రన్ మీడియా ప్రశ్నిస్తోంది.

Written By: K.R, Updated On : June 10, 2023 7:33 pm
Follow us on

Russia: కొన్ని సంఘటనలు సమకాలీన చరిత్రను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఇరాక్, ఇరాన్ పై అమెరికా సాగించిన యుద్ధాలు, జపాన్ పై అణు బాంబులు వేసిన అమెరికా.. ఇప్పుడు ఈ కోవలోకి రష్యా కూడా చేరింది. జర్మనీని ఒకప్పుడు హిట్లర్ ఎలా నియంతలాగా పాలించాడో.. ఇప్పుడు పుతిన్ కూడా అదే విధంగా పాలన సాగిస్తున్నాడు. అంతే కాదు తన మాట వినని యూరప్ దేశాలను లెక్కచేయడం లేదు. తనమీద కాలు దువ్విన ఉక్రెయిన్ కు సరైన బుద్ధి చెబుతున్నాడు. ఇదే క్రమంలో తాను చేస్తున్న కొన్ని పనులు నివ్వెపరుస్తున్నాయి. అసలే ఆర్థిక మాంద్యం తాలూకు కష్టాల్లో చిక్కుకున్న ప్రపంచాన్ని.. మరింత ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.

చేయకూడని పని

ఉక్రెయిన్ దేశంతో సాగుతున్న సుదీర్ఘ యుధంలో గత మంగళవారం రష్యా చేయకూడని పని చేసింది. దక్షిణ ఉక్రెయిన్ లోని నిప్రో నదిపై ఉన్న కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్టను పాక్షికంగా కూల్చివేసింది. ఆ పక్కనే అణు విద్యుత్ కేంద్రం ఉండడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాస్తవానికి సహనం కోల్పోయిన రష్యా జీవావరణ తీవ్రవాద చర్యకు దిగడంతో ఈ ఘటన జరిగిందని ఉక్రెయిన్ వాదిస్తుండగా.. ఇది పూర్తిగా ఆ దేశపు విద్రోహ చర్య అని రష్యా ఆరోపిస్తోంది. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధిక జల సామర్థ్యం ఉన్న డ్యామ్ లలో నోవా కఖోవ్కా ఆనకట్ట ఒకటి. దీనిపై రష్యా దాడి చేయడంతో నీళ్లు ఊళ్లను ముంచెత్తాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది జనం, పశువులు గుక్కెడు నీరు కోసం అలమటిస్తున్నాయి. వీటన్నింటి కన్నా మించి ఉక్రెయిన్ ఇప్పుడు అణుప్రమాదం అంచున ఉందని ఆందోళన ప్రపంచాన్ని భయపడుతోంది.

రష్యా ఆధీనంలో..

ఇక ఈ డ్యాం పరిసర ప్రాంతాలు రష్యా నియంత్రణలో ఉన్నాయి. అయితే ఈ డ్యామ్ ధ్వంసం తన పని కాదని రష్యా చెబుతోంది. దాన్ని అంత తేలిగ్గా నమ్మే పరిస్థితి లేదు. ఇటీవల నుంచి సరిహద్దు అవతల ఉక్రెయిన్ రష్యా భూభాగం పై దాడులు చేయడం ప్రారంభించింది. డ్రో న్ల సహాయంతో రష్యా మీద వేడిని పెంచింది. అయితే ఇది సహజంగానే రష్యాకు కోపం తెప్పించింది. చాలా తెలివిగా ఉక్రెయిన్ దృష్టిని మరచి, దాని సుస్థిరతను దెబ్బతీసే విధంగా నోవా కఖోవ్కా ఆనకట్ట మీద దాడి చేసిందని యూరప్ రాజకీయ వర్గాలు అంటున్నాయి.. ఉక్రెయిన్ లో సాగుకు కీలకమైన ఐదు ఆనకట్టల్లో నోవా కఖోవ్కా ఒకటి. అయితే దీనికి భారీ గండిపడేలా చేయడం అందులో భాగమే అని తెలుస్తోంది.

ఉక్రెయిన్ కు లాభమేంటి?

అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ కు నోవా కఖోవ్కా ఆనకట్ట ను ధ్వంసం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటని వెస్ట్రన్ మీడియా ప్రశ్నిస్తోంది. నిజానికి మునుపటి దాడుల్లో ఆనకట్ట నిర్మాణం బలహీనపడి ఉండవచ్చు. ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రష్యా ఆక్రమణదారులు రిజర్వాయర్ లో నీళ్లు అసాధారణ స్థాయికి చేరినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఉండవచ్చు. దాని ఫలితమే ఇప్పుడు డ్యామ్ విధ్వంసం అనేది ఒక కథనం. అయితే ఉక్రెయిన్ దళాలు దాడులు పెంచిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడం విశేషం. శత్రువును వరదలతో ముంచెత్తడం కూడా తమ ఆయుధమంటూ గతంలో రష్యా ప్రకటించింది.

నిప్రో నది పై వ్యూహాత్మకంగా..

దక్షిణ ఉక్రెయిన్ లో రష్యా, ఉక్రెయిన్ సేనలను విడదీస్తున్న నిప్రో అనే నది పై ఈ ఆనకట్ట ఉంది. ఆహార ధాన్యాలు అధికంగా పండించే దక్షిణ మధ్య ఉక్రెయిన్ లోని మెట్ట భూములకు సాగునీరు, రష్యా ఆక్రమిత క్రిమియా సహా అనేక భారీ నగరాలకు తాగునీరు ఈ రిజర్వాయర్ అందిస్తుంది. ఇక నది దాటి యువతలకు వచ్చేందుకు యుద్ధంలో వ్యూహాత్మకంగానూ ఇది కీలకమైనదే. అందుకే ఈ విధ్వంసం మానసిక పోరుకు మించినది. రిజర్వాయర్ లో నీళ్లన్నీ ఖాళీ అయితే పక్కనే జపోరిషియా అణు విద్యుత్ కేంద్రానికి తగినంత నీటి సరఫరా జరగదు. ఇప్పటికే అందులో ఆరు రియాక్టర్లను మూసివేశారు. కాబట్టి, చల్లబరిచేందుకు పక్కనే ఉన్న కొలను నీరు సరిపోకపోవచ్చు. మరమ్మతులకు కనీసం ఐదు సంవత్సరాలు పట్టే ఈ ఆనకట్ట విధ్వంసం వల్ల దీర్ఘకాలిక మానవ, పర్యావరణ సంక్షోభం, సైనిక పర్యవసనాలూ తప్పవు. నది గర్భంలో మిగిలిన చర్నోబిల్ ప్రమాదం నాటి అణు వ్యర్ధాలు వరదలతో మళ్లీ పైకొస్తున్నాయి. ఏ ప్రకారం చూసినా ఉక్రెయిన్ ముప్పు ముంగిట్లో ఉందని అర్థమవుతుంది. దీనిపై అటు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఎప్పటిలాగానే తన అవసరాల ఆధారంగా వ్యవహరిస్తోంది. మరి ఈ యుద్ధానికి ముగింపు పలికేది ఎప్పుడో?!