Ramoji Rao vs Jagan : ‘వదల బొమ్మాళి వదలా..’ అంటూ రామోజీరావును జగన్ వదలడం లేదు. మార్గదర్శితో రామోజీరావు పని పట్టడానికే రెడీ అయ్యారు. మార్గదర్శి కేసులు.. డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్న చందాదారులు, అడ్డదిడ్డంగా కోడలు శైలజా కిరణ్ స్టెట్మెంట్లు… ఇవన్నీ ఇప్పుడు మీడియా మొఘల్ రామోజీరావును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పచ్చళ్ల వ్యాపారంతో పదునెక్కి.. ప్రచురణ రంగంలో అడుగుపెట్టి.. మీడియా చక్రవర్తిగా అవతరించి తనకెవ్వరూ సాటిలేరని రామోజీ విర్రవీగారు. తెలుగు రాజకీయాలకు రాజగురువుగా ముద్ర వేసుకొని అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా షేక్ చేసిన రామోజీ ఏపీ సీఎం జగన్ కు అడ్డంగా బుక్కయ్యారు. ఆయన చేతిలో పడి విలవిల్లాడిపోతున్నారు.
తెలుగు ప్రజల సమ్మోహన శక్తిగా ఉన్న ఎన్టీ రామారావునే చుక్కలు చూపించారు. బలమైన రాజశేఖర్ రెడ్డికే చుక్కలు చూపించారు. కానీ జగన్ ముందు తన కుప్పిగంతులు కుదర్లేదు. అవినీతిలో ఏ 1 అని రాసిన రామోజీకే మార్గదర్శి కేసులో ఏ1 గా చూపించిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఈనాడు మీడియా సంస్థను అడ్డు పెట్టుకుని, తనను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు రామోజీరావు కుట్రలకు తెరలేపారని జగన్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల్లో తనను పలుచన చేసేలా ఈనాడులో కథనాలు రాస్తూ, చంద్రబాబు కొమ్ము కాస్తున్నారనే అభిప్రాయాన్ని జగన్ అనేక సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు.
ఆ మధ్యన జగన్ తరచూ ఒక ప్రకటన చేసేవారు. దుష్టచతుష్టయంతో ఇబ్బందిపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. వారిలో రామోజీరావుకు అగ్రస్థానం ఇచ్చారు. అందుకే ఎప్పుడు నుంచో నడుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆర్థిక అవకతవకలను అందిపుచ్చుకున్నారు. ఎలాగైనా రామోజీరావుని కటకటాలపాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. చివరకు ఆయన కోడలు శైలజాకిరణ్ సైతం విడిచిపెట్టలేదు.
దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూప్‌నకు అధిపతి అయిన రామోజీరావును టచ్ చేయడానికి ఏ ప్రభుత్వం సాహసించలేదు. అలాంటిది రామోజీని ఏపీ సీఐడీ వెంటాడుతుండడం విశేషం. రామోజీ, శైలజలను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ మార్గదర్శిలో సోదాలు, అలాగే వాళ్లిద్దరినీ విచారించడం వెనుక ఉద్దేశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామోజీరావు విషయంలో ప్రతి అడుగు సంచలనంగా మార్చి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని జగన్ అడుగులు వేస్తున్నారు.