Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈ అప్రూవర్ల కథలు ఇంకెన్ని రోజులు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈ అప్రూవర్ల కథలు ఇంకెన్ని రోజులు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మరొకసారి వెలుగులోకి వచ్చింది. పలు పత్రికల్లో పతాక శీర్షిక స్థాయి వార్త అయింది. పలు మీడియా ఛానల్స్ లో విస్తృతంగా ప్రసారమవుతోంది.. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన కంటే ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి అరుణ్ రామచంద్ర పిల్లై చేరాడు. రామచంద్ర తో కలిసి అప్రూవర్లుగా మారిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ ముగ్గురు కూడా సౌత్ లాబీని బలంగా నడిపారని ఈడి అధికారులు అంటున్నారు.

ముఖ్యంగా సౌత్ లాబీలో సిబిఐ, ఈడి గుర్తించిన నిందితుల్లో ఒక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్ప దాదాపు అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే ఒక్క కవిత ను మాత్రమే నిందితురాలిగా చూపేందుకు ఈ ప్రయత్నం చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. లేకుంటే ఆమెకు సంబంధం లేదని మొత్తం కేజ్రివాల్, సిసోడియా చేశారనేది నిరూపించబోతున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. అరుణ్ రామచంద్ర కవిత తరపున బినామీగా వ్యవహరించారని అధికారులు అంటున్నారు. గతంలో కూడా తాను కవితకు బినామీనేనని అంగీకరించారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు తన మనసు మార్చుకుని అప్రూవర్ గా మారాను అని చెబుతున్నారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం అరుణ్ రామచంద్ర పేరు మీదుగా సాగిందని ఈడి, సిబిఐ అధికారులు అంటున్నారు.

ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్లుగా మారారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకంగా వ్యవహరించారు. ఇక కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల ఈడి అధికారులు స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. దర్యాప్తు సంస్థల అధికారుల అభిప్రాయం ప్రకారం అప్రూవర్లుగా మారడం అంటే తాము స్కామ్ చేశామని అంగీకరించి, నిజాలు చెప్పడమే. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో వారు చెబుతారు. దాని ప్రకారం ఇతర నిందితుల అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. గతంలో ఢిల్లీ విచారణ సమయంలో కవితను ఈడి అరెస్టు చేస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అటువంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. పలు మార్లు విచారణ జరిగినప్పటికీ ఎటువంటి ముందడుగు పడలేదు. మళ్లీ ఇప్పుడు ఈ కేసులో కదలిక వస్తున్న నేపథ్యంలో కవిత అరెస్టు ఉంటుందా? లేకుంటే ఆప్ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకుంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular