Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయనది అక్రమ అరెస్ట్ అని.. అరెస్టు చేసే తీరును తప్పు పడుతూ ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్షాల నాయకులు నారాయణ, రాఘవులు, తెలంగాణకు చెందిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం నాయకులు స్పందించి సంఘీభావం తెలపడం విశేషం.
తొలుత జాతీయస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపే.. చంద్రబాబు అరెస్ట్ కు కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. అటు తరువాత సమాజ్ వా ది పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాళిదళ్ అధ్యక్షుడు సుక్విర్సింగ్ బాదల్, కర్ణాటక మాజీ సీఎం, జేడిఎస్ నేత కుమారస్వామి, ఆర్జేడి ఎంపి మనోజ్ తదితరులు స్పందించి సంఘీభావం తెలపడం విశేషం.
అయితే ఇలా స్పందిస్తున్న జాతీయ నాయకుల్లో విపక్ష ఇండియా కూటమికి చెందిన వారే అధికంగా ఉండడం విశేషం. గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలకు చంద్రబాబు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అది కూడా ఒక్క బిజెపి విషయంలోనే సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ ఇండియా కూటమికి చెందిన నాయకులు చంద్రబాబుకు మద్దతుగా నిలవడం విశేషం. జగన్,మోడీ సంయుక్త కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.