
Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 16వ తారీకు విచారణ కు రమ్మని కబురు పంపింది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో సంచలనం చెలరేగింది. మొన్ననే జాతీయ పార్టీ హోదా వచ్చిన ఆనందంలో ఉన్న అరవింద్ కు సిబిఐ ఒకసారి గా షాక్ ఇచ్చింది. అసలు నిన్న మొన్నటి వరకు మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ నత్తనడకన సాగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో పిల్లి మొగ్గలు వేస్తోందని ఆరోపించాయి. కానీ వారందరి ఆరోపణలను పటాపంచలు చేస్తూ సిబిఐ పకడ్బందీ ప్లాన్ తో మరొకసారి గట్టి అడుగు వేసింది. ఈసారి ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ పిన్ ను టార్గెట్ చేసింది.. అయితే దీనిపై ఆప్ నేతలు విమర్శలు చేసినప్పటికీ.. అవి పాలపొంగు సామెతను గుర్తుచేస్తున్నాయి.
ఇక అరవింద్ కు నోటీసులు ఇవ్వడం, 16వ తేదీ నాడు విచారణకు రమ్మనడం వెనుక అసలు ఆంతర్యం అతడిని అరెస్టు చేయడమే అని తెలుస్తోంది. సీబీఐ అరవింద్ దగ్గర నుంచి జవాబులు రాబట్టిన తర్వాత ఈ డి ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాతే అరెస్టు కు రంగం సిద్ధం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్యలో మళ్లీ కవితను పిలిపించి విచారణ చేసి, ఆ తర్వాత అరెస్టు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అరవింద్ చెప్పిన సమాధానాలు అంతకుముందు ఇతరులు చెప్పిన సమాధానంతో సరిపోలితే తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం.
ఇప్పటికే అరవింద్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ ను ఈడి విచారించింది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ అరవింద్ కు సమన్లు పంపింది. అయితే గత వారం రోజులుగా ఢిల్లీలోని కొన్ని వర్గాలు అరవింద్ ను అరెస్ట్ చేయవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అరవింద్ కూడా అరెస్టు అయ్యేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
ఇక ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆప్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. సౌత్ గ్రూప్ లో కీలకమైన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు తాను ఆప్ పార్టీ నేతల సూచనలతో 15 కోట్ల రూపాయలు అందజేశానని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో అతడు ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉన్నప్పటికీ సుఖేష్ తన సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించాడు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు డబ్బులు ఇచ్చి మరీ జైలుకు పిలిపించుకున్నాడు. సుఖాన్ని కొనుక్కున్నాడు. ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు పలుమార్లు ప్రశ్నించాయి.. ఇక తనను జైలు నుంచి తప్పిస్తానని చెబితే అరవింద్ కేజ్రివాల్ కు 10 కోట్లు ఇచ్చానని సుఖేష్ ఆరోపిస్తున్నాడు. తీరా చూస్తే ఆప్ మంత్రులు ఒక్కొక్కరు తీహార్ జైలుకు రావడం చూసి సుఖేష్ నోరు విప్పాడు. మద్యం కుంభకోణంలో తాను కూడా కవితకు డబ్బులు ఇచ్చానని ఆరోపిస్తున్నాడు.

వరుసగా ఇన్ని పరిణామాలు జరుగుతుండడంతో ఢిల్లీలోని కొన్ని వర్గాలు అరవింద్ అరెస్టు కావడం ఖాయమని చెబుతున్నాయి. ఇవే వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రచురించే పత్రికలకు చెబుతున్నాయి. అయితే ఆ వివరాలను పుకార్లుగా నమ్ముతున్న ప్రధాన స్రవంతి మీడియా ప్రచురించడం లేదు. వాస్తవంలో అసలు విషయం వేరే ఉంది. అది నిన్న సిబిఐ నోటీసుల రూపంలో బయటపడింది. చివరికి జరగాల్సింది అరెస్టు. అది కూడా త్వరలో జరుగుతుందని ఈడి వర్గాలు అంటున్నాయి.. ప్రస్తుతం కాలుకు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కవితను ఎప్పుడు విచారిస్తారు? ఆమె విచారణకు సహకరిస్తారా? ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అరెస్టు చేస్తారా అనే ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అరవింద్ నే అరెస్టు చేసినప్పుడు,కవిత ఒక లెక్కా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.