Homeఆంధ్రప్రదేశ్‌Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసు: కవితకు ఎందుకు ఈ వినహాయింపులు?

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసు: కవితకు ఎందుకు ఈ వినహాయింపులు?

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విచారణకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తెలియజేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ గతంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పటికే పెండింగ్‌లో ఉన్న నళినీ చిదంబరం పిటిషన్లతో జత చేసి కోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కవితకు నోటీసులు అందడంతో ఆమె తరఫున న్యాయవాదుల ప్రస్తావన మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవిత పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే… కేసు విచారణను వాయిదా వేయాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ధర్మాసనం విచారణను కొనసాగించింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధురి వాదిస్తూ…. నళినీ చిదంబరం కేసు తేలే వరకు కవితను ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని పట్టుపట్టబోమని కోర్టుకు ఈడీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, తాము అలా అనలేదని, నోటీసులు ఇవ్వాల్సి వస్తే వారం రోజుల ముందు నోటీసులు ఇస్తామని అప్పుడు కోర్టుకు చెప్పామని ఎస్వీ రాజు అన్నారు. ‘‘మీకు అవే ఉత్తర్వులు కావాలా?’’ అని ధర్మాసనం ప్రశ్నించగా… నళినీ చిదంబరం కేసులో ఇచ్చిన ఉత్తర్వులు కవితకు వర్తింపజేయాలని విక్రమ్‌ చౌధురి కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలిపించరాదని వాదించారు.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కూడా మహిళలకు పలు రక్షణలు కల్పించిందని, బెయిల్‌ సెక్షన్‌ 45లో కూడా మహిళలకు అనేక సడలింపులు ఉన్నాయని వివరించారు. కాబట్టి ఈ అంశాన్ని తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ‘‘సెక్షన్‌ 160 ఇక్కడ వర్తిస్తుందా లేదా?’’ అని ధర్మాసనం ఆరా తీయగా… విజయ్‌ మదన్‌ లాల్‌ కేసులో సెక్షన్‌ 160పై స్పష్టమైన తీర్పు ఉందని ఎస్వీ రాజు బదులిచ్చారు. ‘‘ఇప్పుడు ఏం చేయమంటారు?’’ అని ధర్మాసనం అడగగా… ఒకవేళ కవిత బిజీగా ఉంటే విచారణ తేదీని 10 రోజుల పాటు పొడిగిస్తామని రాజు స్పష్టం చేశారు. మహిళలను కార్యాలయానికి పిలిపించి విచారించవచ్చా లేదా అన్నది తేల్చే వరకు కవితకు నోటీసులు జారీ చేయరాదని ఆదేశించాలని విక్రమ్‌ చౌధురి విజ్ఞప్తి చేశారు. కాగా, చివరికి ఎస్వీ రాజు విజ్ఞప్తి మేరకు కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం తెలిపింది.

సోనియా గాంధీ పేరు ప్రస్తావించిన కవిత

ఏడాదిన్నర కాలంగా నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ ఏమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అవగాహన కుదిరినందుకే సోనియా, రాహుల్‌గాంధీలను ఈడీ విచారణకు పిలవడం లేదన్న అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. రూ.5 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో రాహుల్‌, సోనియాలపై ఉన్న కేసుల పరిస్థితి ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సోనియా, రాహుల్‌, ఖర్గే, పవన్‌ బన్సల్‌లతో పాటు తెలంగాణ, ఏపీ నాయకులను ఈ కేసులో పిలిచి విచారించారని, ఆ తర్వాత ఏమైందని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య కుదిరిన ఆ అవగాహన ఏంటో చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేష్‌, కేసీ వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటూ మరో రాష్ట్రంలో కొట్లాట పెట్టుకుంటారని, ఆమ్‌ఆద్మీ పార్టీతోనూ రాష్ట్రానికో విధంగా కాంగ్రెస్‌ పార్టీ బహుళ విధానాలను అవలంబిస్తోందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో అదానీ కంపెనీలకు ఎర్ర తివాచీ స్వాగతం పలుకుతూ ఇతర రాష్ట్రాల్లో అదానీని వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 ఏళ్లయిందని, లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం గురించి సోనియాగాంధీ రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version