CWC Meetings In Hyderabad: హైదరాబాద్ లో సీబ్ల్యూసీ సమావేశాలు: ప్రధాన ఎజెండా ఇదే..

శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడి తాజ్‌ కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా మొత్తం 84 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Written By: Bhaskar, Updated On : September 16, 2023 1:50 pm

CWC Meetings In Hyderabad

Follow us on

CWC Meetings In Hyderabad: సీబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకుల మొత్తం భేటీ అయ్యారు. ఏఐసీసీకి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడైన తర్వాత పునర్వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీ తొలి సమావేశం కూడా ఇదే. మరికొద్ది నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడం, జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఇండియా పేరుతో కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి ఏర్పడడం, ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలలో వీటిపై ప్రధానంగా చర్చిస్తున్నారు ప్రస్తుత జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు లేదా మినీ జమిలి ఎన్నికలు వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరుగుతోంది. ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలను ఏఐసీసీ.. జాతీయ రాజకీయాల్లోనే గేమ్‌ చేంజర్‌గా భావిస్తోంది. అందుకే వరుసగా మూడు రోజులు కీలక కార్యక్రమాలను ఎంచుకుంది. ఎన్నికలతోపాటు మణిపూర్‌ అల్లర్లు, చైనా దురాక్రమణ వంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు చేయనున్నారు.

భద్రతా వలయంలో తాజ్‌ కృష్ణా..

శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడి తాజ్‌ కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా మొత్తం 84 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. వీరికి బస కూడా అదే హోటల్లో ఏర్పాటు చేశారు. దీంతో రానున్న రెండు రోజులూ తాజ్‌ కృష్ణా హోటల్‌ పూర్తిగా పోలీసు పహారా, భద్రతా వలయంలో ఉండనుంది. ఇక ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సభ్యులు కలిపి 147 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం జరగనుంది. అనంతరం తుక్కుగూడలో సాయంత్రం 5 గంటలకు విజయభేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ నుంచి సోనియాగాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. సభా వేదికపై సీడబ్ల్యూసీ సభ్యులు ఆసీనులు కానున్నారు. ఆతిథ్యం ఇస్తున్న టీపీసీసీ తరఫున అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాత్రమే వేదికపై ఉంటారు.

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలకుగాను ఆరు గ్యారెంటీలను విజయభేరి సభలో సోనియాగాంధీ ప్రకటించనున్నారు. 10 లక్షల మందితో ఈ సభను నిర్వహించి.. వచ్చే ఎన్నికలకు కిక్‌ స్టార్ట్‌గా ఈవెంట్‌ను వాడుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో విజయభేరి సభ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలంతా ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. మిగిలిన సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ, సీఎల్పీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు.. ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గం చొప్పున తెలంగాణలోని 115 నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. 17న రాత్రి ఆయా నియోజకవర్గాల్లోనే బస చేసి.. 18న స్థానిక నాయకులతో కలసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ సోనియా ప్రకటించిన 6 గ్యారెంటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రూపొందించిన చార్జిషీట్లను పంచుతారు.